Batwara 1947: 'బట్వారా 1947' చిత్రం ద్వారా దేశ విభజన నాటి పరిస్థితులను, మానవత్వ విలువలను అర్థం చేసుకోవాలని యువతకు సన్నీ డియోల్ విజ్ఞప్తి చేశారు. సూపర్‌మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే పవర్‌ఫుల్ అంటూ సన్నీ డియోల్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ పీరియడ్ డ్రామా ‘బట్వారా 1947’. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో సన్నీ డియోల్, ప్రీతి జింటా, కరణ్ డియోల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సన్నీ డియోల్, నేటి తరం యువత అంతా ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. దేశ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలు, వారి త్యాగాలు అర్థం కావాలంటే ఈ చిత్రం చూడటం చాలా అవసరం అని అన్నారు. లోకంలో మానవత్వం కంటే ఏదీ గొప్పది కాదని ఈ సినిమా నిరూపిస్తుందని చెప్పారు.
ఆస్ఘర్ వజాహత్ రాసిన ప్రసిద్ధ నాటకం ‘జిస్ లాహోర్ నై వేఖ్యా ఓ జమ్మెయ్ నై’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై నేషనల్ అవార్డు విన్నర్ రాజ్‌కుమార్ సంతోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షబానా అజ్మీ, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు.
25
గదర్ 2001తో పోలిక వద్దు.. ఇది పూర్తిగా వేరు
ఇండియా-పాకిస్తాన్ విభజన నేపథ్యం అనగానే అందరికీ సన్నీ డియోల్ 2001 బ్లాక్‌బస్టర్ ‘గదర్: ఏ ప్రేమ్ కథ’ గుర్తుకొస్తుంది. అయితే, ఈ విషయమై సన్నీ స్పష్టత ఇచ్చారు. “గదర్ అనేది దేశ విభజన కాలంలో సాగే ఒక అందమైన ప్రేమకథ. తారా సింగ్ సరదాగా ఉండే వ్యక్తి. పాటలు పాడుతూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ సర్దార్. కానీ ‘బట్వారా 1947’ కథ పూర్తిగా వేరు. ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఎమోషనల్ కథ. ఇందులో కథానాయకుడు తన కుటుంబంతో పాటు ఒక వృద్ధురాలిని కాపాడటానికి పోరాడతాడు” అని సన్నీ వివరించారు.
ట్రైలర్ నచ్చిన ప్రతి ఒక్కరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ చిత్రాల విజయం వల్లే, 30 ఏళ్ల తర్వాత మళ్లీ రాజ్‌కుమార్ సంతోషితో కలిసి ఈ నాలుగో సినిమా చేయగలిగానని తెలిపారు.
35
సూపర్‌మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే శక్తివంతమైన పాత్ర
దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను తాము 2010లోనే అనుకున్నామని వెల్లడించారు. మొదట ‘లాహోర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టామని, కానీ కథకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో ‘బట్వారా’గా మార్చినట్టు చెప్పారు. “గదర్‌లో తారా సింగ్ తన హక్కుల కోసం పోరాడతాడు. కానీ ఈ సినిమాలో సన్నీ పాత్ర ఇతరుల హక్కుల కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది శారీరక బలం కంటే నైతిక ధైర్యంతో కూడుకున్నది. హాలీవుడ్ సూపర్ హీరోలు సూపర్‌మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే కూడా సన్నీ పోషించిన ఈ క్యారెక్టర్ చాలా శక్తివంతమైనది” అని సంతోషి వ్యాఖ్యానించారు.
తాము ఏ వర్గానికి సపోర్టు లేదా సందేశాలు ఇవ్వడానికి ఈ సినిమా తీయలేదని, ఇదొక వినోదాత్మక మానవీయ కోణం ఉన్న కథ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే మనుషులుగా స్పందించాలని, పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి చూడాలని అన్నారు.
విభజన సమయపు కష్టాల గురించి సన్నీ డియోల్ మాట్లాడుతూ.. తమది పంజాబ్ కుటుంబమని, చిన్నతనంలో ఉమ్మడి కుటుంబంలో పెరిగినప్పుడు తాతయ్య, అమ్మమ్మల నుంచి ఆనాటి కథలు చాలా విన్నానని చెప్పారు. ఈ కథ వినగానే తనకు బాగా కనెక్ట్ అయిందని, అందుకే ఈ సినిమా చేశానని తెలిపారు.
అలాగే, ఈ సినిమాతో ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ప్రీతి జింటా వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. 2004లో వచ్చిన ‘వీర్-జారా’ ప్రేమకథ కాగా, ఇది పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్న మూవీ అని ఆమె తెలిపారు.
55
మహిళల వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం.. స్పందించిన ప్రీతి జింటా
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 1947 కాలం నాటి మహిళల జీవనశైలి గురించి ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ కాలంలో మహిళలు కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడానికే పరిమితమయ్యారని ఆమె సరదాగా అన్న మాటలపై విమర్శలు వచ్చాయి. దీంతో ప్రీతి జింటా సోషల్ మీడియాలో స్పందించారు.
తన వ్యాఖ్యలను సందర్భరహితంగా అర్థం చేసుకున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. “ఇది ఒక నిర్దిష్టమైన కుటుంబానికి సంబంధించిన కథ. సినిమా చూడకుండానే జడ్జ్ చేయడం ఏమాత్రం సరికాదు. బాధ్యతాయుతమైన జర్నలిజం ఉండాలి. ఆగస్టు 14న సినిమా చూసిన తర్వాతే ఒక అభిప్రాయానికి రండి” అని ప్రీతి జింటా విజ్ఞప్తి చేశారు.