
కొన్ని విజువల్ వండర్ చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి చిత్రాలకు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. మనకు తెలుగులో అలాంటి చిత్రం బాహుబలి ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత గ్రాండ్ విజువల్స్ తో పాన్ ఇండియా స్థాయిలో అనేక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. కానీ బాహుబలినే తలదన్నే చిత్రం ఒకటి దాదాపు 19 ఏళ్ల క్రితమే వచ్చిందంటే నమ్మగలరా.. కానీ ఇది నిజం. ఇప్పుడు ఆ చిత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే 'అపోకలిప్టో'. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు మేల్ గిబ్సన్ రూపొందించిన ఈ విజువల్ వండర్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం 2006లో విడుదలైంది. ఈ చిత్రంలో మెస్మరైజ్ చేసే అంశాలు బోలెడన్ని ఉన్నాయి. శతాబ్దాల క్రితం జరిగిన కథాంశంతో గిబ్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ మొత్తం అడవిలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఫ్రేమ్ లో విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఉత్తర అమెరికా మేసో అమెరికన్ అడవుల నేపథ్యంలో గిరిజన తెగకు సంబంధించిన కథ ఇది.
కొన్ని శతాబ్దాల క్రితం ఉత్తర అమెరికా అడవుల్లో జీవనం సాగించిన మాయన్ తెగకు సంబంధించిన కథాంశంతో గిబ్సన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో హీరోగా రూడీ యంగ్ బ్లడ్ నటించారు. రూడీ తోపాటు, హెర్మాండేజ్, రోల్ ట్రుజిల్లో, మైరా సెర్బులో కీలక పాత్రల్లో నటించారు.
జాగ్వర్ పా(రూడీ యంగ్ బ్లడ్) ఒక రోజు వేటకు వెళ్లడంతో అతడికి విందు చేసుకునేంత మాంసాహారం దొరుకుతుంది. ఆ మాంసాహారంతో రూడీ ఆరోజు రాత్రి ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి విందు చేసుకుంటాడు. ఆ మరుసటి రోజే రూడీపై మరొక తెగ భయంకరమైన దాడి చేస్తుంది. ఈ దాడిని ముందే పసిగట్టిన రూడీ తన కుటుంబాన్ని సేఫ్ ప్లేస్ లో దాచి పెట్టేస్తాడు. రూడీకి మరొక తెగకు భీకరమైన పోరు ఎలా జరిగింది.. ఆ దాడి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ? చివరికి రూడీ తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడా? అనేది మిగిలిన కథాంశం.
ఈ కథ మొత్తం శతాబ్దాల క్రితం గిరిజన తెగల మధ్య ఉత్తర అమెరికా అడవుల్లో జరిగిన పోరాటం నేపథ్యంలో ఉంటుంది. దర్శకుడు మేల్ గిబ్సన్ అటవీ నేపథ్యంలో చూపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ కావడం గ్యారెంటీ. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మ్యాజిక్ లా ఉంటుంది. ఈ చిత్రంలో చిన్నపాటి మైనస్ ఏంటంటే.. దర్శకుడు గిబ్సన్ సహజత్వం కోసం అన్ని పాత్రలతో మాయన్ తెగ భాషలోనే డైలాగులు చెప్పించారు.
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు అయితే ఊపిరి బిగబట్టుకుని చూస్తారు. అంత ఉత్కంఠ భరితంగా ఆ సన్నివేశాలు ఉంటాయి. హీరో.. విలన్ చోటు నుంచి తప్పించుకునే సన్నివేశం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దర్శకుడు గిబ్సన్ స్క్రీన్ ప్లేని పరుగులు పెట్టించారు. అలా అని కేవలం యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. మాయన్ తెగ నాగరికత, సంస్కృతి, వేషధారణ, ఆహారపు అలవాట్లు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉండేవి అనే అంశాలని డీటెయిల్ గా చూపించారు.
అపోకలిప్టో చూశాక.. బాహుబలి లాంటి విజువల్ వండర్ చిత్రాలు కూడా దీని ముందు దిగదుడుపే అని అనిపిస్తాయి. ఈ ఎపిక్ హిస్టారికల్ డ్రామా చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. యూట్యూబ్ లో కూడా ఉంది.
ఈ చిత్రం బెస్ట్ మేకప్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ కాగలిగింది కానీ.. అవార్డులు గెలుచుకోలేకపోయింది. ఈ చిత్రం 138 నిమిషాల నిడివితో ఉంటుంది. ఈ చిత్రాన్ని 40 మిలియన్ డాలర్ల బడ్జెట్లో నిర్మించారు. అంటే 300 కోట్ల పైగా బడ్జెట్ అన్నమాట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లు సాధించింది.ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రాబర్డ్ డ్యువల్, స్పైక్ లీ, క్వింటిన్ టరంటినో ఈ చిత్రంపై ప్రసంశలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి అయితే మేల్ గిబ్సన్ తెరకెక్కించిన బ్రేవ్ హార్ట్, అపోకలిప్టో చిత్రాలు తనపై చెరగని ముద్ర వేశాయి అని పలు సందర్భాల్లో తెలిపారు.