అమితాబ్‌ రేర్‌ పిక్స్ః చిరు, బాలయ్య, నాగ్‌, మహేష్‌, ప్రభాస్‌, పవన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టిలతో ఫోటోలు వైరల్‌

First Published | Oct 11, 2021, 6:28 PM IST

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌.. ఇండియన్‌ సినిమాకి ఓ గర్వ కారణం. హీరోగా పనికి రావనే ఎగతాళి నుంచి తనని మించిన స్టార్‌ లేడనే స్థాయికి ఎదిగిన తీరు యావత్‌ సినీ లోకానికి స్ఫూర్తిదాయకం. నేడు అమితాబ్‌ బచ్చన్‌ 79వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టార్స్ చిరు, నాగ్‌, బాలయ్య, మహేష్‌, పవన్‌, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి స్టార్స్ అమితాబ్‌తో దిగిన అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

అమితాబ్‌ బచ్చన్‌ బర్త్ డే సందర్భంగా ఆయన జీవితంలోని అరుదైన, ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో ఇతర స్టార్లు ఆయనతో దిగిన ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా సౌత్‌ స్టార్స్ తో బిగ్‌బీ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

1942, అక్టోబర్‌ 11న జన్మించారు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన అసలు పేరు ఇంక్విలాబ్‌. ఆ తర్వాత అమితాబ్‌గా మార్చిన విషయం తెలిసిందే. `ఎన్నటికీ ఆరని దీపం` అనేది ఆయన పేరులోని అర్థం. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ ఒక బ్రాండ్‌గా అవతరించారు. ఆయనే కాదు, ఆయన వాయిస్‌ కూడా ఓ బ్రాండ్‌. ఆ వాయిస్‌కి పేటెంట్‌ హక్కులు కూడా ఉంటాయి. ఆయన వాయిస్‌ని ఎవరూ అమితాబ్‌ అనుమతి లేకుండా వాడుకోకూడదు. 


ఐదు దశాబ్దాల తిరుగులేని సినిమా ప్రస్థానంలో రెండు వందలకుపైగా సినిమాల్లో నటించి తిరుగులేని సూపర్‌ స్టార్‌గా, మెగా స్టార్‌గా ఎదిగారు అమితాబ్‌ బచ్చన్‌. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవాలకుగానూ పద్మ శ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

అమితాబ్‌ నటన పరంగానే కాదు, చదువుల్లోనూ ముందే ఉన్నారు. ఆయన ఆర్ట్స్‌లో రెండు పీజీలు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమల్ కాలేజ్ లో బీఎస్సీ చేశారు. చదువయ్యాక ఉద్యోగంలో చేరాడు. కలకత్తాలోని `బర్డ్ అండ్ కో` అనే షిప్పింగ్ కంపెనీలో మెటీరియల్ బ్రోకర్‌గా పనిచేస్తూ.. సినిమా వేషాల కోసం ప్రయత్నించారు. 20వ ఏట ఉద్యోగం వదిలి, ముంబయికి వెళ్లారు. 

సునీల్‌ దత్‌ సినిమా `రేష్మా ఔర్‌ షేరా`లో ఒక మూగవాడి పాత్రకోసం అమితాబ్‌ని ఎంపిక చేశారట. అమితాబ్‌కు ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరా గాంధీ తన స్నేహితురాలైన నర్గీస్‌కు లేఖ రాయడం విశేషం. సినిమాల్లో అమితాబ్ కెరీర్ వాయిస్ నేరేటర్ గా మొదలైంది. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ అవార్డ్ విన్నింగ్ మూవీ `భువన్ షోమ్`తో అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

తర్వాత ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన ‘సాత్ హిందుస్థానీ’ చిత్రంలో ఏడుగురు హీరోల్లో ఒకడిగా నటించారాయన. సినిమా హిట్ కాలేదు. కానీ, అమితాబ్ క్లిక్ అయ్యాడు. తొలి చిత్రంతోనే బెస్ట్ న్యూ కమర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అమితాబ్ ఆయన కెరీర్‌లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. ఈ సినిమాకి అమితాబ్‌ అందుకున్న పారితోషికం వెయ్యి రూపాయలు.

హీరోగా అమితాబ్‌కు తొలి సూపర్‌హిట్‌ని అందించిన సినిమా `జంజీర్‌`. ఈ సినిమాకి ముందు బిగ్‌బీ నటించిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఇక, సినిమాల్లో ఆయనకు ఇష్టమైన పేరు విజయ్‌. ఆ పేరుతో దాదాపు 20 సినిమాల్లో నటించారు బిగ్‌బీ.

1970ల్లో విడుదలైన చిత్రాలు ఆయన్ని 'యాంగ్రీ యంగ్‌మేన్'ను చేశాయి. ఆ తర్వాత తరం నటులెవరూ ఆ పిలుపును దక్కించుకోలేకపోయారు. అమితాబ్‌ తన జీవితభాగస్వామి అయిన జయ బాధురిని పుణె టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో తొలిసారి కలిశారు. `గుడ్డి` సినిమా సెట్‌లో రెండోసారి చూశారు. ఆ తర్వాత 1973లో అమితాబ్, జయబాదురిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

1971లో వచ్చిన `ఆనంద్‌` నుంచీ 1988లో వచ్చిన `షెహన్‌షా` సినిమా వరకూ పదిహేడేళ్లపాటు ఏటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక నటుడు అమితాబ్‌. బాలీవుడ్‌లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే. తన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ `షోలే` లో హీరోగా నటించిన బిగ్‌బీ...ఆ మూవీ రీమేక్ `ఆగ్‌`లో విలన్‌గానూ నటించి కొత్త రికార్డు క్రియేట్ చేసారు.

నిర్మాణంలోకి అడుగుపెట్టి ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమయ్యారు. దీంతో అమితాబ్‌ పనైపోయిందన్నారు. అప్పులపాలై ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన స్థితిలో పడిపోయారు అమితాబ్. తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తుపెట్టుకుని మరీ అందరి బాకీలను చెల్లించిన క్రమశిక్షణ, నిబద్ధత అమితాబ్‌కే సొంతం. అయితే మధ్యలో ఆయన షూటింగ్‌ ప్రమాదంలో గాయపడ్డారు. నడుముకి తీవ్ర గాయాలయ్యాయి.  అలాంటి విపర్కర పరిస్థితుల నుంచి కోలుకుని పడిలేచిని కెరటంలా దూసుకొచ్చారు. ఆ తర్వాత తిరుగులేని విధంగా ఆయన కీర్తి పతాకాలు పెరుగూపోయాయి. 

హీరోగా, నటుడిగా ప్రభంజనం సృష్టించిన అమితాబ్‌ టీవీ రంగంలోనూ తనకు సాటి లేదని, తిరుగులేదని నిరూపించుకున్నారు. 2000 సంవత్సరంలో `కౌన్ బనేగా కరోడ్ పతి` షో టెలివిజన్ చరిత్రలో సంచలనం. ఇపుడు అమితాబ్ వ్యాఖ్యాతగా పదో సీజన్ నడుస్తోంది.

ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్‌ నిజజీవితంలో అసలు మద్యం తీసుకోరు. అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్‌ రెండు చేతులతోనూ రాయగలరు. మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో చోటుదక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్‌. 2001 ఈజిప్టులో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అమితాబ్‌ని `యాక్టర్‌ ఆఫ్‌ ది సెంచరీ` పురస్కారంతో గౌరవించారు. 

ఒలింపిక్‌ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం అమితాబ్‌కి లభించింది. 2012 లండన్‌లో ఒలింపిక్‌ జ్యోతిని చేతబట్టి ఆయన 300 మీటర్లు పరుగుతీశారు.2015లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించారు బిగ్‌బీ.
 

అమితాబ్...వృత్తిని దైవంగా భావిస్తారు. చిత్రీకరణకు ఆలస్యంగా రావడం అంటే ఆయనకు తెలియదు. `షరాబీ` చిత్రీకరణలో ఉండగా ఆయన చేతులు కాలిపోయాయి. అయినా ఆయన షూటింగ్ ఆపలేదు. గాయాలు కనబడకుండా చేతుల్ని కోటు జేబులో పెట్టి నటించారు. అది అప్పట్లో ఓ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారడం విశేషం.

బీబీసీ నిర్వహించిన `యాక్టర్‌ ఆఫ్‌ ది మిలీనియం` పోల్‌లో చార్లీచాప్లిన్‌, మార్లన్‌ బ్రాండోలను సైతం వెనక్కునెట్టి అమితాబ్‌ ఆ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. 
 

Latest Videos

click me!