
ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు రావడం కామనే. కానీ కొంత గ్యాప్‌తో అలాంటి సినిమాలు వస్తుంటాయి. కానీ ఒకే టైమ్‌లో ఒకే కాన్సెప్ట్ తో మూవీస్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు జరిగింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని ఒకే కాన్సెప్ట్ తోనే సినిమాలు చేశారు. ఆ కాన్సెప్ట్ `గుర్తింపు`. దీనితో అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు. రామ్ చరణ్ డీసెంట్ హిట్ కొట్టాడు. ఇప్పుడు నాని వంతు వచ్చింది. `ప్యారడైజ్`తో సంచలనం సృష్టిస్తాడా అనేది చూడాలి. అయితే ఇదే కాన్సెప్ట్ తో ప్రభాస్ 21ఏళ్ల క్రితమే సినిమా చేయడం విశేషం.
నేచురల్ స్టార్ నాని తాజాగా `ది ప్యారడైజ్` మూవీలో నటించాడు. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, ప్రియదర్శి వంటి వారు నటించారు. రా అండ్ రస్టిక్, మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం దుమ్ములేపుతోంది. మొదటి రోజు అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. రెండో రోజు కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సవారీలు అనే జాతి గుర్తింపు కోసం చేసిన పోరాటం నేపథ్యంలో సాగిన కథ. 200 ఏళ్లుగా గుర్తింపుకునోచుకోని జాతి.. తమ గుర్తింపు కోసం చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. తమ సవారీ జాతి కోసం జడల్ పాత్రలో నాని తిరుగుబాటు చేస్తాడు. పోరాడటతాడు. చివరికి విజయం సాధిస్తాడు. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ కలెక్షన్లు బాగున్నాయి. ఓవరాల్‌గా ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది మున్ముందు తెలుస్తుంది. నాని రికార్డులు సృష్టిస్తాడా అనేది చూడాలి.
ఇక ఆ మధ్యనే ఇదే కాన్సెప్ట్ తో రామ్ చరణ్ `పెద్ది` సినిమా చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెలకు గుర్తింపులేదు. చనిపోయినా, పుట్టిన పట్టించుకునేవారు లేదు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ఏళ్లతరబడి వాళ్లు ఆ ఫారెస్ట్ లోనే మగ్గుతుంటారు. అయితే తమ గుర్తింపు ఆట కావాలని, ఆటనే ఆయుధంగా మలుచుకొని తమ గుర్తింపు కోసం రామ్ చరణ్ పెద్దిగా చేసిన పోరాటమే ఈ చిత్రం. క్రికెట్ నుంచి రెజ్లింగ్, ఆ తర్వాత రన్నర్‌గా మారి ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఆ తర్వాత తమ వారికి గుర్తింపుని, అలాగే రైల్వే స్టేషన్‌ని తీసుకొస్తాడు పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని సమాచారం.
కానీ ఇదే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ `పుష్ప` సినిమా చేశాడు. అయితే తమ ప్రాంత గుర్తింపు కోసం కాదు, తమ ఇంటి పేరు కోసం పుష్ప చేసిన పోరాటమే ఈ చిత్రం. తన నాన్న ఉంచుకున్నదానికి పుట్టాడని పుష్పకి వారి సర్‌నేమ్ ఇవ్వరు. వారి కుటుంబంలో చేర్చుకోరు. దీంతో ఆ విషయంలో చిన్నప్పట్నుంచి అవమానాలు ఫేస్ చేస్తాడు పుష్ప. ఈ క్రమంలో తాను ఎర్రచందనం కూలీగా ప్రారంభమై, స్మగ్లర్‌గా మారి, ఆ తర్వాత సిండికేట్‌ని శాసించే నాయకుడిగా, అనంతరం రాజకీయాలనే శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. ఆ తర్వాత ఫ్యామిలీ పుష్పరాజ్‌ని గుర్తిస్తుంది. తమ కుటుంబంలో కలుపుకుంటారు. ఎమోషన్స్, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. మొదటి పార్ట్ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబడితే రెండో భాగం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేయడం విశేషం.
అయితే ప్రభాస్ మాత్రం ఈ కాన్సెప్ట్ తో 21ఏళ్ల క్రితమే సినిమా చేశాడు. అదే `ఛత్రపతి`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సముద్ర తీర ప్రాంతంలోని జాలర్లు గుర్తింపు లేక పెద్ద వ్యాపారి వద్ద పనిచేస్తుంటారు. వారి ఇచ్చింది తీసుకొని బతకాలి, లేదని ఎదురుతిరిగితే చంపేస్తారు. అది చిన్న పిల్లాడు అయినా, పెద్ద వాళ్లయినా, ఈ క్రమంలో ఛత్రపతిగా ప్రభాస్ తిరుగుబాటు చేస్తాడు. గుర్తింపు సాధిస్తాడు. తమ ఏరియాకి నాయకుడు అవుతాడు. అయితే ఇది పూర్తి కమర్షియల్ యాంగిల్‌లో, మదర్ సెంటిమెంట్‌తో రూపొందించారు రాజమౌళి. అది వర్కౌట్ అయ్యింది. 2005లో విడుదలై అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇలా గుర్తింపు కోసం చేసిన సినిమాలు చాలా వరకు ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.