నటి రుక్మిణి వసంత్ ఏఐ (AI) డీప్‌ఫేక్ అశ్లీల వీడియోను వైరల్ చేసిన కేసులో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఈ నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ పేరుతో ఏఐ టెక్నాలజీ వాడి అశ్లీల వీడియోలు, ఫోటోలు సృష్టించి వైరల్ చేసిన కేసును బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి, వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
25
ముగ్గురు అరెస్ట్
అరెస్ట్ అయిన వారిని రవికుమార్ (24), చంద్రకాంత్ (33), రంజిత్ (25)గా పోలీసులు గుర్తించారు. రవికుమార్ బాగల్‌కోట్ జిల్లా వాసి కాగా, రంజిత్ బెంగళూరు నగరానికి చెందినవాడు. మూడో నిందితుడు చంద్రకాంత్ స్వస్థలం శివమొగ్గలోని తీర్థహళ్లి. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
35
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లో నటి రుక్మిణి వసంత్ ముఖంతో ఉన్న ఒక అశ్లీల వీడియో వైరల్ అయింది. ఇది ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన వీడియో. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన రుక్మిణి, 'నేను అలాంటి దృశ్యాల్లో నటించలేదు, ఇది ఆకతాయిల పని' అని స్పష్టం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సీసీబీ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వీడియో అప్‌లోడ్ అయిన ఖాతాల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ వీడియోలను వేరే రాష్ట్రం వాళ్లు షేర్ చేశారని అనుమానించారు. కానీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌లో కర్ణాటకకు చెందిన ఆకతాయిలే ఈ పని చేశారని తేలింది. కేసు నమోదు కాగానే నిందితులు సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సైబర్ పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.
55
వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?
అరెస్ట్ అయిన నిందితులను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా వీళ్లు ఇతర నటీమణుల వీడియోలను కూడా ఇలాగే మార్ఫింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసి మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.