టాలీవుడ్ 2022 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్... ఆర్ ఆర్ ఆర్ అలా కాపాడింది, కానీ పట్టుమని పది హిట్స్ లేవు! 

First Published Jun 30, 2022, 2:22 PM IST

టాలీవుడ్ 2022 ఫస్ట్ హాఫ్ ముగించుకుంది. ఈ ఆరు నెలల కాలంలో పది చిత్రాల లోపే విజయఢంకా మోగించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ఇండస్ట్రీ రికార్డ్స్ నమోదు చేయగా రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. 2022 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఎలా ఉందో పరిశీలిద్దాం...

జనవరి రామ్ గోపాల్ వర్మ దిశా ఎన్కౌంటర్ చిత్రంతో ప్రారంభమైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దిశా పరాజయం పాలైంది. కొన్నాళ్లుగా వర్మ చిత్రాలను జనాలు సీరియస్ గా తీసుకోవడం మానేశారు. ఇక అందరికీ తెలిసిన సంగతే కదా అనుకున్నారేమో దిశా చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. తర్వాత విడుదలైన వరుణ్ సందేశ్ ఇందువదన, రానా 1945 చిత్రాల పరిస్థితి కూడా అంతే. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేదు. 2022 సంక్రాంతి పెద్ద చిత్రాల సంకటం కారణంగా కళావిహీనంగా ముగిసింది. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా... కరోనా ఆంక్షల నేపథ్యంలో చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ కారణంగా చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.


బంగార్రాజు(Bangarraju), రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి, హీరో చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో బంగార్రాజు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. పోటీ లేకపోవడంతో బంగార్రాజు క్యాష్ చేస్తుంది. నాగార్జున-నాగ చైతన్య(Naga Chaitanya)ల మల్టీస్టారర్ హిట్ స్టేటస్ అందుకుంది. 2022 ఫస్ట్ హిట్ మూవీగా బంగార్రాజు నిలిచింది. ఇక ఇదే నెలలో గుడ్ లక్ సఖీ చిత్రంతో కీర్తి సురేష్ థియేటర్స్ లోకి వచ్చారు. మహానటి మినహాయిస్తే... కీర్తి ఖాతాలో మరో ప్లాప్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా గుడ్ లక్ సఖి మిగిలిపోయింది.


క్రాక్ హిట్ తో ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడి మూవీతో ఫిబ్రవరి నెల ప్రారంభించారు. వివాదాల మధ్య విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. దర్శక నిర్మాతలతో హీరో రవితేజ వివాదాలు కూడా సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. అనంతరం సెహరి, మళ్ళీ మొదలైంది బాక్సాఫీస్ బరిలో దిగాయి. ఒక్క హిట్ కోసం తపస్సు చేస్తున్న సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది... ఆయనకు మళ్ళీ నిరాశే మిగిల్చింది. ఫిబ్రవరి నెలలో విడుదలైన సంచలన చిత్రం  డీజే టిల్లు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా డబుల్ డిజాస్టర్ కాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్(Bheemla Nayak) యావరేజ్ నమోదు చేసింది. 


మార్చి నెల టాలీవుడ్ కి మిక్స్డ్ ఫలితాలు ఇచ్చింది. రాధే శ్యామ్(Radhe Shyam) లాంటి డిజాస్టర్ ఆర్ ఆర్ ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇదే నెలలో విడుదలయ్యాయి. భారీ నష్టాలు మిగిల్చిన రాధే శ్యామ్ టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. ఇక మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్(RRR Movie) చిత్రం మాత్రం వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. రాజమౌళి పేరు ఇండియా వైడ్ మారుమ్రోగగా ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ రాబట్టారు. ఇక ఈ నెలలో విడుదలైన కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి 524, ఆడవాళ్లు మీకు జోహార్లు, స్టాండప్ రాహుల్ ప్లాప్ ఖాతాలో చేరిపోయాయి. 
 

ఇక ఏప్రిల్ టాలీవుడ్ కి ఝలక్ ఇచ్చింది. మరో డిజాస్టర్ మంత్ గా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్, బ్లడీ మేరీ చిన్న చిత్రాలతో పాటు గని, ఆచార్య వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన వరుణ్ తేజ్ గని అట్టర్ ప్లాప్ కాగా ఆచార్య డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి కెరీర్ లో అత్యంత చెత్త మూవీగా ఆచార్య(Acharya) నిలిచింది. రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్లిపోయిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు.

మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చితే మే నెల ఒకింత మే పర్వాలేదు. ఈ నెలలో విడుదలైన సర్కారు వారి పాట, ఎఫ్ 3, అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయితీ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రాజశేఖర్ శేఖర్ మూవీ వివాదాల్లో నలిగిపోయింది. శ్రీవిష్ణు భళాతందానా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.


విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్ద చిత్రాల విడుదలతో పూర్తి స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఎఫ్3 ఫలితాన్ని కూడా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata), మేజర్, విక్రమ్ (Vikram)దెబ్బతీశాయి. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఎఫ్3 వీక్ డేస్ లో నెమ్మదించింది. మొత్తంగా హిట్ స్టేటస్ అందుకుంది. మే నెలలో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన చిత్రం సర్కారు వారి పాట. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మహేష్ స్టార్ డమ్ తో హిట్ తీరం చేరింది. బ్రేక్ ఈవెన్ దాటి క్లీన్ హిట్ గా నిలిచింది. 

జూన్ నెలలో దాదాపు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో మేజర్ క్లీన్ హిట్ గా నిలిచింది. మేజర్  సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా మేజర్ తెరకెక్కింది. అడివి శేష్ హీరోగా నటించగా మహేష్ నిర్మించారు. మహేష్ కి లాభాలు పంచిన మేజర్ హిట్ లిస్ట్ లో చేరింది. ఇక ఈ నెలలో విడుదలైన చిత్రాల్లో సమ్మతమే మాత్రమే హిట్ స్టేటస్ దక్కించుకునే అవకాశం కలదు. అంచనాల మధ్య విడుదలైన విరాటపర్వం, అంటే సుందరానికీ కమర్షియల్ గా ఆడలేదు. సత్యదేవ్ గాడ్సే, ఆకాష్ పూరి చోర్ బజార్, వర్మ కొండా, సుమంత్ అశ్విన్ 7 డేస్ 6 నైట్స్ ప్లాప్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మొత్తంగా ఈ ఆరు నెలల్లో పది చిత్రాలు కంటే తక్కువే క్లీన్ హిట్ గా నిలిచాయి.

click me!