2017 నుంచి 2025 వరకు 18 వేలకు పైగా చిత్రాలు CBFC వద్ద సెన్సార్ చేయబడ్డాయి. వాటిలో అత్యధిక ఎ రేటెడ్ చిత్రాలు, అత్యధిక యు రేటెడ్ చిత్రాలని నిర్మించిన ఇండస్ట్రీలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
సినిమాలలో కంటెంట్ నియంత్రణకి సెన్సార్ బోర్డు చాలా కీలకం. ఏ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అని ఆడియన్స్ గుర్తించడానికి వీలుగా సెన్సార్ బోర్డు వివిధ కేటగిరీలలో సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటుంది. 2017 నుంచి ఇప్పటి వరకు CBFC వద్ద 18000 చిత్రాలు సెన్సార్ చేయబడ్డాయి. ఆ డేటా ప్రకారం ఏ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమాలు ఎక్కువగా విడుదలయ్యాయి అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
25
వివిధ కేటగిరీలలో సెన్సార్ సర్టిఫికెట్స్
ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు చూడదగినవి కాదని సెన్సార్ బోర్డు భావించే చిత్రాలకు ఎ సర్టిఫికెట్ దక్కుతుంది. 18 ఏళ్ళు నిండిన వారు ఆ చిత్రాలని చూడవచ్చు అని సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుంది. ఇక యు సర్టిఫికెట్ సినిమాల విషయానికి వస్తే ఎలాంటి షరతులు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు అందరూ ఆ చిత్రాలని చూడవచ్చు. యు/ఎ సర్టిఫికెట్ లో కొంత మేరకు షరతులు ఉంటాయి.
35
అత్యధిక 'యు' రేటెడ్ చిత్రాలతో టాప్ లో మలయాళం
2017 నుంచి 2025 వరకు అత్యధిక యు రేటెడ్ సినిమాలు నిర్మించిన ఇండస్ట్రీగా మలయాళీ చిత్ర పరిశ్రమ టాప్ లో నిలిచింది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా రూపొందించబడింది అని సెన్సార్ బోర్డు డేటా చెబుతోంది. మలయాళీ చిత్ర పరిశ్రమలో అత్యధికంగా 35 శాతం యు రేటెడ్ చిత్రాలు వచ్చాయి. ఇదే ఇండస్ట్రీలో 60 శాతం యు/ఏ చిత్రాలు, 5 శాతం ఎ రేటెడ్ చిత్రాలు వచ్చాయి.
ఇంగ్లీష్ తర్వాత అత్యధిక ఎ రేటెడ్ చిత్రాలు తెలుగులోనే
ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇండియాలో విడుదలైన ఇంగ్లీష్ సినిమాలు కాకుండా టాలీవుడ్ లో అత్యధిక 'ఎ' రేటెడ్ చిత్రాలు వచ్చాయి. తెలుగులో 'ఎ' రేటెడ్ చిత్రాలు 12 శాతం ఉన్నాయి. ఇంగ్లీష్ చిత్రాలు 16 శాతం ఉన్నాయి. ఇక తెలుగులో 13 శాతం యు రేటెడ్ సినిమాలు, 75 శాతం యు/ఎ రేటెడ్ చిత్రాలు ఉన్నాయి. మసాలా కంటెంట్, రొమాన్స్, వయలెన్స్ ఎక్కువగా ఉండే చిత్రాలని ప్రేక్షకులకు అందించడానికి నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఎ రేటెడ్ చిత్రాలు నిర్మిస్తున్నారు.
55
అతి తక్కువ యు రేటెడ్ సినిమాలతో భోజ్ పురి ఇండస్ట్రీ
అతి తక్కువ యు రేటెడ్ సినిమాలు నిర్మించిన చిత్ర పరిశ్రమగా భోజ్ పురి ఇండస్ట్రీ నిలిచింది. ఈ ఇండస్ట్రీ నుంచి కేవలం 6 శాతం మాత్రమే యు రేటెడ్ సినిమాలు వచ్చాయి. తెలుగు తర్వాత అత్యధిక ఎ రేటెడ్ సినిమాలు కలిగిన ఇండస్ట్రీ గా కన్నడ చిత్ర పరిశ్రమ నిలిచింది. 11 శాతం ఎ రేటెడ్ చిత్రాలు కన్నడ నుంచి వచ్చాయి. మలయాళం తర్వాత అత్యధిక యు రేటెడ్ చిత్రాలు కలిగిన ఇండస్ట్రీగా తమిళ చిత్ర పరిశ్రమ 26 శాతంతో రికార్డు సాధించింది. చిన్న చిత్ర పరిశ్రమల జాబితాలో ఒడియా ఇండస్ట్రీ 42 శాతం యు రేటెడ్ చిత్రాలు నిర్మించింది.