ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.6 కోట్లు విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏపీలో నిన్న చెప్పిన విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇక, తెలంగాణకు పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీకి కోటి, తెలంగాణకు కోటి, పంచాయతీలకు 4 కోట్లు.. మొత్తం కలుపుకుని రూ.6కోట్లు విరాళంగా ఇచ్చారు పవన్ కల్యాణ్.