ఆ ముచ్చట కూడా తీర్చుకున్న ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌తో అగ్ర జట్లతో పోటీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..

First Published Jan 25, 2023, 4:50 PM IST

WPL Auction: మినీ ఐపీఎల్ గా భావించే  ఎస్ఎ 20లో  ఉన్న ఫ్రాంచైజీలన్నీ  ఇక్కడివే. అక్కడ చెన్నై, ముంబై, ఢిల్లీ, సన్ రైజర్స్,  రాజస్తాన్ రాయల్స్ తో పాటు లక్నోకు కూడా  టీమ్ ఉంది. కానీ ఆర్సీబీకి మాత్రం....!

ఐపీఎల్ లో  అత్యంత  క్రేజ్  కలిగిన జట్లలో ఒకటిగా  ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. పలు మార్లు ఫైనల్ కు వెళ్ళినా ఆ జట్టు ట్రోఫీ కల నెరవేరలేదు.  ప్రపంచ స్థాయి ఆటగాళ్లు..  టీమ్ నిండా కావాల్సినంత గ్లామర్.. ఎక్కడ  మ్యాచ్ ఆడినా   వచ్చే అభిమానులు.. ఇలా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ టీమ్ కు  ఇంతవరకూ ఐపీఎల్ ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. 

గతేడాది వచ్చిన ఓ నివేదిక ప్రకారం క్రీడలలో అత్యంత ప్రజాధరణ పొందిన   ఫ్రాంచైజీలలో ఆర్సీబీ ఆరో స్థానంలో నిలిచింది.  ఈ జాబితాలో చెన్నై.. ఆర్సీబీ కంటే ముందుంది.  అయితే ఐపీఎల్ లో తనకంటే తక్కువ గ్లామర్ ఉన్న టీమ్ లు ఇతర దేశాలలో లీగ్ లలో  పెట్టుబడులు  పెట్టి  వాటిని సొంతం చేసుకుంటుంటే  ఆర్సీబీ మాత్రం అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదు. 

మినీ ఐపీఎల్ గా భావించే  ఎస్ఎ 20లో  ఉన్న ఫ్రాంచైజీలన్నీ  ఇక్కడివే. అక్కడ చెన్నై, ముంబై, ఢిల్లీ, సన్ రైజర్స్,  రాజస్తాన్ రాయల్స్ తో పాటు నిన్న మొన్న వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా  పెట్టుబడులు పెట్టి టీమ్ లను దక్కించుకున్నాయి. 

అంబానీ ఆధ్వర్యంలోని  ముంబై ఇండియన్స్ అయితే ఐపీఎల్ తో పాటు ఎస్ఎ 20, యూఏఈలో జరిగే  ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లలో కూడా పెట్టుబడులు పెట్టింది.  అంబానీ త్వరలోనే ఫుట్‌బాల్ క్లబ్ అర్సెనల్ తో పాటు ఇంగ్లాండ్ లో జరిగే ‘ది హండ్రెడ్’లో కూడా ఓ టీమ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఐఎల్ 20లో  టీమ్ ను దక్కించుకుంది.

తమకంటే తక్కువ క్రేజ్ ఉన్న టీమ్ లు కూడా విదేశాలలో  దూసుకుపోతుంటే ఆర్సీబీ ఎందుకు  అడుగు ముందుకు వేయడం లేదని ఆ టీమ్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోయేవారు.  అక్కడ కూడా  టీమ్ లను దక్కించుకుంటే ఆర్సీబీ  విలువ మరింత పెరిగేదన్నది అభిమానుల  వాదన.  కానీ ఆర్సీబీ నుంచి  ఈ విషయంలో  ఏ ప్రకటనా  రాలేదు. 

కానీ అనూహ్యంగా  బీసీసీఐ తాజాగా ప్రకటించిన  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో   బెంగళూరు  ఫ్రాంచైజీని  ఆర్సీబీ దక్కించుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ  మద్యం తయారీ సంస్థ  డియాజియోతో కలిసి  ఆర్సీబీ.. మహిళల క్రికెట్ లో ఓ  ఫ్రాంచైజీని దక్కించుకుంది.  

ఈ టీమ్ కోసం 9  బిడ్స్  పోటీ పడ్డా  చివరికి  దీనిని ఆర్సీబీనే దక్కించుకోవడంతో బెంగళూరు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  మిగతా టీమ్ ల మాదిరిగానే తమకు కూడా  మరో ఫ్రాంచైజీ దక్కినందుకు సంతోషంగా ఉందని, తాము కూడా అగ్రజట్లతో పోటీ పడతామని వ్యాఖ్యానిస్తున్నారు. 

click me!