భార్య కోసం తరలొచ్చిన భర్త.. హేలీకి మద్దతుగా స్టేడియానికి వచ్చిన స్టార్క్.. ఫోటోలు వైరల్

First Published Mar 24, 2023, 9:43 PM IST

WPL 2023: వన్డే సిరీస్ ముగిసిన  తర్వాత ఐపీఎల్ లో ఆడబోయే ఆస్ట్రేలియా ప్లేయర్లు తమ  ఫ్రాంచైజీలతో కలిస్తే.. ఐపీఎల్ లో ఆడలేని  క్రికెటర్లు ఆస్ట్రేలియా కు వెళ్లిపోయారు.కానీ స్టార్క్  ఐపీఎల్ ఆడకున్నా ఇక్కడే ఉండిపోయాడు. 

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఇటీవలే  భారత్ తో ముగిసిన వన్డే సిరీస్ లో తన ఇన్‌స్వింగర్లతో టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి రెండు వన్డేలలో భారత బ్యాటర్లు   స్టార్క్ బంతులను ఎదుర్కోవడం కంటే  పెవిలియన్ కు వెళ్లిందే బెటర్ అనే స్థాయిలో సాగింది అతడి విధ్వంసం.  

వన్డే సిరీస్ ముగిసిన  తర్వాత ఐపీఎల్ లో ఆడబోయే ఆస్ట్రేలియా ప్లేయర్లు తమ  ఫ్రాంచైజీలతో కలిస్తే.. ఐపీఎల్ లో ఆడలేని  క్రికెటర్లు ఆస్ట్రేలియా కు వెళ్లిపోయారు.  మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్ ఆడడు. అయినా అతడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. దానికి కారణముంది.  స్టార్క్ భార్య  ప్రస్తుతం భారత్ లోనే ఉంది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్  టీమ్ సారథి  అలీస్సా హేలీ.. స్టార్క్ భార్యే అన్న విషయం తెలిసిందే.    డబ్ల్యూపీఎల్ లో  ప్లేఆఫ్స్ కు చేరిన ఆ జట్టు  నేడు ముంబై ఇండియన్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్నది.  ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు గాను స్టార్క్.. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో సందడి చేశాడు.   
 

యూపీ వారియర్స్ జెర్సీ వేసుకుని  హేలీతో పాటు  యూపీ టీమ్ ను ఎంకరేజ్ చేశాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్  సారథి  హర్మన్‌ప్రీత్ కౌర్..   పర్శవి చోప్రా వేసిన  ఓవర్లో  ఎల్బీ కోసం అప్పీల్  చేయగా అంపైర్ ఔటిచ్చారు. అయితే డీఆర్ఎస్ లో  ఫలితం యూపీకి  వ్యతిరేకంగా  వచ్చింది. అప్పుడు స్టార్క్.. ‘ప్చ్.. మిస్ అయింది’అన్నట్టుగా  ఫేస్ పెట్టాడు. 

కాగా.. నేడు  అలీస్సా హేలీ బర్త్ డే. ముంబైతో మ్యాచ్ కు ముందు  యూపీ టీమ్  హేలీ బర్త్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకకు  స్టార్క్ కూడా వచ్చాడు. ఆమె ముఖానికి కేక్   పూశాడు. తర్వాత భార్యను అలింగనం చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హేలీ  కీలక మ్యాచ్ ల సమయంలో  స్టార్క్ ఎప్పుడూ తోడే ఉంటాడు. గతేడాది  వన్డే వరల్డ్ కప్ సందర్భంగా  హేలీ  ఫైనల్ లో ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో కూడా స్టార్క్ వచ్చి ఆమెను ఎంకరేజ్ చేశాడు.  

ఈ మ్యాచ్ కు స్టార్క్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన   నీరజ్ చోప్రా కూడా హాజరయ్యాడు. ప్రేక్షకుల మధ్య  కూర్చుని ఈ మ్యాచ్ ను తిలకించాడు.  ప్లే ఆఫ్స్ కావడంతో ఈ మ్యాచ్ కు  ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.  డీవై పాటిల్ స్టేడియం దాదాపుగా ఫుల్ అయింది. 

click me!