ఏం చేయమంటారు..? మా దరిద్రం అలా తగలడింది.. వర్షం వల్ల జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంపై బౌచర్ కామెంట్స్

First Published | Oct 25, 2022, 4:58 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా  సోమవారం జింబాబ్వేతో తలపడిన  దక్షిణాఫ్రికా.. వర్షం వల్ల నష్టపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచే స్థితిలో ఉన్నా సఫారీలను వరుణుడు మరోసారి దెబ్బకొట్టాడు. 

ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికాకు ఉన్నంత దురదృష్టం మరే జట్టుకూ ఉండదంటే అతిశయెక్తి కాదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా..  ప్రపంచ స్థాయి క్రికెటర్లు, అగ్రశ్రేణి  బ్యాటర్లు, దిగ్గజ బౌలర్లు,  మెరుగైన ఫీల్డర్లు, ఏ క్షణం అయినా మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్లకు ఆ జట్టులో కొదవ లేదు.  

ఇన్ని ఉన్నా దక్షిణాఫ్రికా ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కప్పు కూడా కొట్టలేదు. ప్రత్యర్థి జట్ల కంటే కూడా ఈ  టోర్నీలలో వర్షం  ఆ జట్టు ప్రధాన శత్రువు వరుణుడే.  1992 ప్రపంచకప్, 2003 లలో డక్ వర్త్ లూయిస్ విధానాలు ఆ జట్టును నిండా ముంచాయి.  


Image credit: Getty

తాజాగా  2022 టీ20 ప్రపంచకప్ లో కూడా ఆ జట్టును  వరుణుడు పలకరించాడు. మామూలుగా సెమీస్ లోనో లేక గ్రూప్ స్టేజ్ లో కీలక దశలోనూ  సౌతాఫ్రికాకు వర్షం అడ్డంకులు సృష్టిస్తే  ఇప్పుడు మాత్రం తొలి మ్యాచ్ లోనే షాకిచ్చాడు. జింబాబ్వేతో సోమవారం ముగిసిన మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండానే రద్దైంది. దీంతో ఇరు జట్లు రెండు పాయింట్లను సమానంగా (తలా ఒకటి) పంచుకున్నాయి. ఇది ఇప్పుడు ఏం ప్రభావం చూపుతుందో గానీ  సెమీస్ వరకు  సఫారీలకు ఫలితాలు తేడా కొడితే మాత్రం  ఆ ప్రభావం పడుతుంది. 
 

ఇక ఇదే విషయమై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే తో మ్యాచ్ అనంతరం  అతడు మాట్లాడుతూ.. ‘అవును. మాకు గతంలో వర్షం వల్ల ఎలాంటి అనుభవాలు ఉన్నాయో తెలుసు.  1992, 2003 ప్రపంచకప్ లలో మేం వర్షం కారణంగా  కీలక మ్యాచ్ లను కోల్పోయాం. అయితే అప్పటిమాదిరిగా కాకుండా ఇప్పుడు తొలి మ్యాచ్ లోనే వరుణుడు మమ్మల్ని పలకరించాడు. 

Mark Boucher

మేము ఇక్కడికి ప్రపంచకప్ ఆడటానికి వచ్చాం. ఆడతాం కూడా.  ఈ మ్యాచ్ జరగాలని రెండు జట్ల  సారథులు కోరుకున్నారు. ఈ మ్యాచ్ కంటే ముందు బంగ్లాదేశ్ - నెదర్లాండ్స్ మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది.  అప్పుడు మైదానం పొడిగా ఉంది. కానీ  జింబాబ్వే-సౌతాఫ్రికా మ్యాచ్ కు మాత్రం వర్షం అడ్డంకి కలిగించింది..

దీని ద్వారా మాకు తెలిసొచ్చిన విషయమేమిటంటే..  ఇవి (వర్షం వల్ల మ్యాచ్ లు నిలిచిపోవడం) ఆటగాళ్లు తీసుకునే  నిర్ణయాలు కాదు. అధికారులు తీసుకోవాలి’ అని చెప్పాడు. ఈ మ్యాచ్ లో తాము  గెలిచే పొజిషన్ లో ఉండి ఫలితం తేలకుండా ఉండటం   నిరాశ కలిగించిందన్న  బౌచర్..  ఒకవేళ జింబాబ్వే తాము ఉన్న పరిస్థితుల్లో ఉంటే వాళ్లు ఆటను కొనసాగించేవాళ్లేమో..’ అని చెప్పాడు. 

Image credit: Getty

జింబాబ్వే-సౌతాఫ్రికా మ్యాచ్ కు పదే పదే వరుణుడు అంతరాయం కలిగించడంతో  ఈ మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు.  జింబాబ్వే తొలుత బ్యాటింగ్ కు వచ్చి  5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.   సౌతాఫ్రికా.. 3 ఓవర్లకే 51 పరుగులు చేసింది.  డక్ వర్త్ లూయిస్ ప్రకారం మరో 13 పరుగుల చేసినా విజయం సాధించేది. కానీ 3 ఓవర్ల తర్వాత  మరోసారి వర్షం కురిసి సఫారీ ఆశలపై నీళ్లు చల్లింది. 

Latest Videos

click me!