ఔట్ చేస్తే ఔట్ అంతే.. దానిలో క్రీడా స్ఫూర్తి ఎక్కడిది? ఇదో పనికిమాలిన చర్చ.. నాన్ స్ట్రైకర్ రనౌట్‌పై హార్ధిక్

First Published | Oct 25, 2022, 3:27 PM IST

Hardik Pandya: ఇటీవల  క్రికెట్ లో అత్యంత చర్చనీయాంశమైన నాన్ స్ట్రైకర్ రనౌట్ (మన్కడింగ్) పై టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రనౌట్ చేస్తే అది ఔట్ కింద పరిగణించాలని కుండబద్దలు కొట్టాడు. అసలు దీనిలో క్రీడా స్ఫూర్తికి చోటు ఎక్కడుందని  చెప్పాడు. 
 

టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ రివ్యూలో పాల్గొన్న పాండ్యా నాన్ స్ట్రైకర్ ఎండ్ రనౌట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.  పాండ్యా మాట్లాడుతూ.. ‘అసలు మనం ఈ నాన్ స్ట్రైకింగ్ రనౌట్ గురించి  ముందు చర్చ మానేయాలి. దీని మీద ఇంత చర్చ అవసరం లేదు. 

క్రికెట్ లో అన్నింటిలాగే అది కూడా ఒక రూల్. అంతే. క్రీడా స్ఫూర్తి వంటి విషయాలకు ఇక్కడ చోటే లేదు. ఒకవేళ అది ఉంటే ఉంటదంతే.. వ్యక్తిగతంగా ఈ తరహా రనౌట్ పై నాకైతే  సమస్య లేదు. నేను  క్రీజు ను దాటినప్పుడు ఎవరైనా బౌలర్ నన్ను రనౌట్ చేస్తే నేను వెళ్లిపోతా. అది నా తప్పు. అంతే. అలా ఔట్ చేయవచ్చని నిబంధన కూడా ఉంది కదా.. ’ అని అన్నాడు. 


గతనెలలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో  టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ..   ఇంగ్లీష్ బ్యాటర్ చార్లీ డీన్ ను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రనౌట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు, అక్కడి మీడియా.. మిగతా పనులన్నీ పక్కనబెట్టి  ఇదొక్కటే పని అన్నట్టుగా విశ్లేషణలు, విమర్శలు చేస్తూ దీప్తిని, ఇండియాను బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. 

ఇటీవలే ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20లో జోస్ బట్లర్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉండగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా.. ‘క్రీజులో ఉండు. నేను దీప్తి శర్మ లా రనౌట్ చేయను. కానీ క్రీజు దాటకు..’ అని బెదిరించాడు. దీంతో ఈ అంశం గురించి  చర్చ ఊపందుకుంది. సాక్షాత్తు ఐసీసీ సైతం అది  రూల్స్ లో ఉంది అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఇంగ్లాండ్ మాత్రం శూల శోధన చేస్తూ పరువు తీసుకుంటున్నది. 

ఇక టీ20లలో ఏ నెంబర్ లో బ్యాటింగ్ కు రావడం తనకు ఇష్టమని పాండ్యాను  అడగగా.. తాను అలాంటివి పట్టించుకోనని, పరిస్థితులను బట్టి ఆడతానని చెప్పాడు. ‘ఏ నెంబర్ లో బ్యాటింగ్ రావాలనేది నా విషయంలో వర్కవుట్ అవదు.  పరిస్థితులకు తగ్గట్టుగా నేను బ్యాటింగ్ చేస్తాను.  టాప్ 3 లేదా 4వ స్థానంలో వచ్చేవారికి ఇవి సెట్ అవుతాయి. నాకు మాత్రం అప్పటి సిట్యూయేషన్ ను బట్టి నా ఆటతీరు ఉంటుంది. 

అయినా టీ20లలో ఈ మ్యాచ్ అప్స్ (ఏ స్థానంలో బ్యాటింగ్ కు రావడం అనేది) పెద్దగా వర్కవుట్ అవ్వవు. టెస్టు, వన్డేలలో అయితే ఇవి ఓకే. కానీ  పొట్టి ఫార్మాట్ లో అంత సమయం ఉండదు. కానీ ఈ ఫార్మాట్ లో ఇవి మరీ ప్రాధాన్యం పొందుతున్నాయి..’ అని పాండ్యా  తెలిపాడు. 

Latest Videos

click me!