ఇక సెమీ ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భారత్ కు విజయాన్ని అందించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 264 పరుగుల టార్గెట్ ను భారత్ ముందు ఉంచగా, త్వరగానే గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ రోహిత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మంచి భాగస్వామ్యం తో భారత్ ను గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు.
చివరలో కేఎల్ రాహుల్ 42 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 84 పరుగులతో విజయాన్ని అందించి భారత్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. టీమిండియా మరో 2 ఓవర్లు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి 267 పరుగులతో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై కోహ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు కానీ, ఫీల్డింగ్ సమయంలో భారత గెలుపుకోసం రోహిత్ సేనతో గెలుపు వ్యూహాలు అమలు చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కేవలం బ్యాటింగ్ తో మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లో కూడా అదుర్స్ అనిపిస్తూ సూపర్ క్యాచ్ లను అందుకున్నాడు. కింగ్ కోహ్లీ మొత్తంగా తన వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 302 మ్యాచ్ లను ఆడగా, 290 ఇన్నింగ్స్ లలో 14181 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 183 పరుగులు కాగా, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు కొట్టాడు. నేనే కింగ్ అంటూ నిరూపిస్తున్నాడు.