ఫ్యాబ్ - 4 ప్లేయర్లు వస్తున్నారు.. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత..!

First Published Mar 27, 2023, 6:35 PM IST

IPL 2023: పదిహేనేండ్ల క్రితం   పురుడు పోసుకున్న ఐపీఎల్ లో ఎన్నో ఘనతలు. వింతలు, విశేషాలు, రికార్డులకూ కొదవ లేదు. ఈ ఏడాది ఐపీఎల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. 

15 ఏండ్లుగా  క్రికెట్ అభిమానులను  వినోదాల జడివానలో ముంచెత్తుతున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో    లెక్కకు మిక్కిలి రికార్డులున్నాయి. ఘనమైన చరిత్ర కలిగిన ఐపీఎల్ లో ఘనతలకూ కొదవలేదు.  కానీ  ఈ ఏడాది  ఐపీఎల్ మరో అరుదైన ఘనతను సొంతం  చేసుకునేందుకు సిద్ధమవుతున్నది.  

ఆధునిక క్రికెట్ లో ఫ్యాబ్ - 4 క్రికెటర్లుగా  కీర్తికెక్కిన బ్యాటర్లు  రాబోయే ఐపీఎల్ లో భాగం కాబోతున్నారు.  టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ,   న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్  కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్  ఆటగాడు  జో రూట్,  ఆస్ట్రేలియా మాజీ సారథి   స్టీవ్ స్మిత్ లను ఆధునిక క్రికెట్ లో ఫ్యాబ్ - 4 క్రికెటర్లుగా వ్యవహరిస్తారు.  ఈ నలుగురు త్వరలో మొదలుకాబోయే  ఐపీఎల్ - 16లో భాగం కాబోతున్నారు. 

కోహ్లీ, కేన్ మామ,  స్టీవ్ స్మిత్  లు ఐపీఎల్ ఆడటం కొత్తేమీ కాదు.   జో రూట్ మాత్రం ఐపీఎల్ ఆడుతుండం ఇదే ప్రథమం.  ప్రస్తుతం  కోహ్లీ ఆర్సీబీ తరఫును ఆడుతుండగా  కేన్ విలియమ్సన్   ఈ సీజన్ లో గుజరాత్  జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 
 

ఇక జో రూట్ ను ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్  సొంతం చేసుకుంది. ఈ టెస్టు బ్యాటర్ కు ఆడే అవకాశం వస్తుందో  రాదో తెలియదు గానీ సీజన్  లో  రాజస్తాన్ విజయాలకు తనవంతు కృషి చేస్తానని  రూట్  పాత్రికేయుల సమావేశాల్లో  చెబుతున్నాడు.  

కాగా గతంలో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడిన   స్టీవ్ స్మిత్.. వాస్తవానికి  2022 సీజన్ కు ముందు జరిగిన వేలంలో అమ్ముడుపోలేదు. కానీ  తాజాగా అతడు ట్విటర్ వేదికగా స్పందిస్తూ..  ‘నమస్తే ఇండియా..  నేను మీ కోసం ఓ ఎగ్జయిటింగ్ న్యూస్ చెప్పబోతున్నా.  నేను ఈ ఏడాది ఐపీఎల్ లో జాయిన్ కాబోతున్నా.  భారత్ లో మోస్ట్ ఎక్సెప్షనల్, ప్యాషనేట్ టీమ్ తో  చేతులు కలపబోతున్నా...’అని   వీడియోలో  పేర్కొన్నాడు.  

దీంతో  స్మిత్.. ముంబై, చెన్నై, బెంగళూరు ఫ్రాంచైజీలలో ఏదో ఒక  జట్టు తరఫున ఆడనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అతడు కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో  మరి  స్మిత్ ఏ ఫ్రాంచైజీకి ఆడతాడనేది   ప్రస్తుతానికైతే సస్పెన్సే.. ఒకవేళ    క్రికెటర్ గా ఆడే ఛాన్స్ రాకుంటే   కామెంటేటర్ గా అయినా అతడు  ఐపీఎల్ - 2023లో భాగం అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.   
 

అయితే వీడియోలో స్మిత్ మాత్రం   ఓ జనాకర్షణ ఉన్న టీమ్ లో భాగం కాబోతున్నా అని చెప్పడంతో అతడి రీఎంట్రీ పక్కా అని ఖాయమవుతుంది. అదే జరిగిన ఏదైనా టీమ్ లో స్మిత్ చేరితే మాత్రం అది చరిత్రే. ఫ్యాబ్ - 4 ఆటగాళ్లు కలిసి ఆడిన లీగ్ గా ఐపీఎల్ చరిత్ర పుటల్లోకెక్కనుంది.  మరి ఇది నిజం కావాలంటే  స్మిత్ ఏ ఫ్రాంచైజీకి ఆడతాడోననేదానిపై ఆధారపడి ఉంది. 

click me!