నేనెవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ తీసుకున్నప్పుడే...

First Published Jan 10, 2022, 4:27 PM IST

విరాట్ కోహ్లీ క్రీజులో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో, ప్రెస్ కాన్ఫిరెన్స్‌ల్లోనూ అంతే దూకుడుగా సమాధానాలు చెబుతాడు. సఫారీ టూర్‌కి ముందు బీసీసీఐ అధికారులు, తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరలేదని షాకింగ్ కామెంట్లు చేసిన విరాట్ కోహ్లీ, మూడో టెస్టు ఆరంభానికి ముందు మీడియా ముందుకి వచ్చాడు...

సఫారీ టూర్‌కి ముందు విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్ కారణంగా బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అందుకే మొదటి రెండు టెస్టుల సమయంలోనూ విరాట్ మీడియా ముందుకి రాలేదు...

అయితే విరాట్ కోహ్లీ కేప్ టౌన్ టెస్టుకి ముందు మీడియా ముందుకి వచ్చి అందరికీ సమాధానం చెబుతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించాడు. ద్రావిడ్ చెప్పినట్టే, కేప్ టౌన్ టెస్టుకి ముందు మీడియాతో ముచ్చటించాడు విరాట్ కోహ్లీ...

‘నేను, ఎమ్మెస్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ తీసుకున్నప్పుడు ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడో స్థానంలో ఉండేది. దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా...

ఎలాగైనా టీమిండియాను టెస్టుల్లో నెం.1 చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నా. ముఖ్యంగా బౌలింగ్‌ పటిష్టంగా మారిస్తే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎక్కడైనా గెలవగలమని తెలుసు.... దానిపైనే ఫోకస్ పెట్టాం...

టీమిండియా ఆడుతున్న విధానం, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మేం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతీ ప్లేయర్ సహకారం, భాగస్వామ్యం ఉంది... 

నేను ఇప్పుడు ఎవరికీ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. టెస్టుల్లో నెం.1 టీమ్‌గా కొనసాగుతున్నాం. గాయం కారణంగా రెండో టెస్టు ఆడకపోయినందుకు బాధపడ్డా....

గాయం కారణంగా ఆడలేకపోతే సిగ్గుగా ఉంటుంది. నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా. మహ్మద్ సిరాజ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఫాస్ట్ బౌలర్‌ 110 శాతం ఫిట్‌గా ఉంటేనే టెస్టు మ్యాచ్ ఆడేందుకు అర్హుడు. 

మూడో టెస్టుకి సిరాజ్ దూరంగా ఉంటాడు. అతని స్థానంలో ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కోచ్‌తో, వైస్ కెప్టెన్‌తో మాట్లాడిన తర్వాత ఎవరు ఆడతారనేది చెప్పగలను...

రవీంద్ర జడేజా గాయపడినా రవిచంద్రన్ అశ్విన్ బ్యాటుతో బాగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా అద్భుతంగా ఆడారు. వారి అనుభవం వెలకట్టలేనిది...

ఒకే తప్పును మళ్లీ చేయాలంటే వాటి మధ్య కనీసం 7 నుంచి 9 నెలల గ్యాప్ ఉండాలని ఓసారి ఎమ్మెస్ ధోనీ చెప్పాడు, అప్పుడు సుదీర్ఘ కెరీర్‌ ఉంటుందని అన్నాడు. నన్ను ఆ సలహా బాగా ప్రేరేపించింది...

రిషబ్ పంత్‌ షాట్ సెలక్షన్ గురించి ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా చర్చించాం. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తూనే ఉంటారు. వాటిని రిపీట్ చేయకుండా చూసుకుంటేనే సక్సెస్ అవుతాం...

కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీలో నాకు ఎలాంటి లోపాలు కనిపించలేదు. అతను తన ఆలోచనలు, వ్యూహాలను పక్కగా అమలు చేశాడు. అయితే అతనికి ఇంకా అనుభవం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ...

click me!