ఐపీఎల్ వేళల్లో మార్పులు, ఒకే టైమ్‌కి రెండు మ్యాచులు... మీడియా టెండర్లకు ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్...

First Published Sep 28, 2021, 10:35 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ కీలక మార్పు చేసింది బీసీసీఐ. అక్టోబర్ 8న జరిగే ఆఖరి లీగ్ మ్యాచులు, రెండూ ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా డబుల్ హెడర్ డే రోజున జరిగే మ్యాచుల్లో ఒకటి మధ్యాహ్నం 3:30 ప్రారంభమైతే, మరోటి సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యేది..

అక్టోబర్ 8న జరిగే రెండు మ్యాచులు, ఒకే సమయానికి జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8న  సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబీలో మధ్యాహ్నం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సాయంత్రం మ్యాచ్‌లు జరగాల్సి ఉంది...

ఓ మ్యాచ్ మధ్యాహ్నం, ఓ మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కావడం వల్ల ఒకే ఛానెల్‌లో రెండు మ్యాచులను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్‌కి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు రెండు మ్యాచులు ఒకే టైం ప్రారంభమైతే, ఆ అవకాశం ఉండదు...

ఈ ఎత్తుగడకి ప్రధాన కారణం... మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌తో పోలిస్తే, ప్రైమ్ టైం సాయంత్రం జరిగే మ్యాచ్‌కి వ్యూయర్‌షిప్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వచ్చే సీజన్‌లో ఒకే టైంలో రెండు మ్యాచులు నిర్వహిస్తే, ఫలితం ఎలా ఉంటుందనే విషయంలో ప్రయోగం చేయనుంది బీసీసీఐ...

ఐపీఎల్ 2022 సీజన్‌‌తో స్టార్ స్పోర్ట్స్ ప్రసార హక్కుల గడువు ముగియనుంది. 2023 నుంచి 2027 వరకూ మీడియా రైట్స్ కోసం టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదనంగా రెండు కొత్త జట్లను జోడించనుంది బీసీసీఐ. ఈ రెండు కొత్త జట్లకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 25, 2021న రానుంది...

అదే రోజున 2023-2027 సైకిల్‌కి సంబంధించిన ఐపీఎల్ మీడియా రైట్స్ టెండర్ కూడా విడుదల కానుంది. వచ్చే సీజన్‌లో అదనంగా రెండు జట్లు వస్తుండడంతో 60 రోజుల ఐపీఎల్ పండగ, 74 రోజుల పాటు సాగనుంది...

దీంతో ఒకే టైంలో రెండు మ్యాచులు నిర్వహిస్తే, వ్యూయర్‌షిప్‌పై ఆ ప్రభావం పాజిటివ్‌గా పడుతుందా, నెగిటివ్‌గా ఉంటుందా? అనే విషయాన్ని తేల్చడానికి ఈ సీజన్ ఆఖరి గ్రూప్ మ్యాచులను టార్గెట్‌గా చేసుకుంది బీసీసీఐ...

అదనంగా చేర్చే రెండు ఐపీఎల్ జట్ల ద్వారా బీసీసీఐకి దాదాపు రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. మీడియా రైట్ల రూపంలోనూ 2018-22 సీజన్‌ కోసం రూ.16,348 కోట్లు చెల్లించింది స్టార్ ఇండియా. ఈసారి దానికి అదనంగా మరో రూ.4 వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!