Ashes: అతడు మంచి ఆటగాడే కానీ కెప్టెన్ గా మాత్రం జీరో.. ఇంగ్లాండ్ సారథిపై ఆసీస్ లెజెండరీ క్రికెటర్ కామెంట్స్

First Published Dec 19, 2021, 4:14 PM IST

Ian Chappell: ఇంగ్లాండ్ సారథి జో రూట్ కెప్టెన్సీ పై ఆ దేశానికి చెందిన సీనియర్లే కాదు.. ప్రత్యర్థి జట్లకు చెందిన  మాజీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆటగాడిగా రూట్ గొప్ప ప్లేయరే అయినా....!

యాషెస్ సిరీస్ లో భాగంగా మరోసారి ఓటమి తో పోరాడుతున్న ఇంగ్లాండ్ సారథి జో రూట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దికాలంగా అతడు బ్యాట్ తో రాణిస్తున్నా.. కెప్టెన్ గా మాత్రం అతడి వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైన రూట్ సేన.. అడిలైడ్ లో జరుగుతున్న రెండో టెస్టులో కూడా ఓటమికి దగ్గరగా ఉంది. 

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ కూడా రూట్ పై విమర్శలు ఎక్కుపెట్టాడు. అతడు గొప్ప ఆటగాడు కానీ సారథిగా మాత్రం పనికిరాడు అని కామెంట్స్ చేశాడు. 

చాపెల్ మాట్లాడుతూ.. ‘రూట్ అద్భుతమైన  బ్యాటర్. కానీ సారథిగా మాత్రం అతడి ప్రదర్శన ఏమంత బాగోలేదు. అతడిని ఓ సాధారణ కెప్టెన్ గానో లేక దురదృష్టవంతమైన కెప్టెన్ అని అనలేము.

ఊహాశక్తి లేకున్నా దీర్ఘకాలం సారథిగా  కొనసాగే కెప్లెన్టు చాలా అరుదుగా ఉంటారు. అలాగే అదృష్టం ఉన్న నాయకుడిపై సదరు జట్టు ఆటగాళ్లు కూడా విశ్వాసం కలిగి ఉంటారు. అతడు అద్భుతాలు  చేస్తాడని  వాళ్లు కూడా నమ్ముతారు. కానీ రూట్ మాత్రం నిజంగా పూర్ కెప్టెన్...’ అని అన్నాడు. 

కాగా.. రూట్ కెప్టెన్సీ పై ఇటీవలే న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్కల్లమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆటగాడిగా బెస్ట్ పర్ఫార్మర్ అయిన రూట్.. సారథిగా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని బ్రెండన్ వ్యాఖ్యానించాడు.

ఇక ఇదే సమయంలో రూట్ తో పోల్చితే ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ మాత్రం అద్భుతమైన సారథి అని చాపెల్ అన్నాడు. అతడు తన లోపాల నుంచి తప్పులను తెలుసుకుని మెరుగవుతున్నాడని చాపెల్ చెప్పాడు. 
 

‘కెప్టెన్ గా నియమితుడు కాకముందే  కమిన్స్ ను అందరూ పోస్ట్ మాన్ పాట్ అని పిలిచేవారు. ఆస్ట్రేలియాకు అవసరమైన సమయంలో వికెట్ తీసే బౌలర్ గా గుర్తింపు పొందిన కమిన్స్.. ఆ బాధ్యతలకు న్యాయం చేస్తాడు.. 


రాబోయే రోజుల్లో కెప్టెన్ గా కమిన్స్ మరింత మెరుగవుతాడు. ఎందుకంటే మంచి నాయకులు తప్పుల నుంచి నేర్చుకుని విజయాలు సాధిస్తారు. భవిష్యత్తులో  వాటిని చేయకుండా ప్రయత్నిస్తారు...’ అని తెలిపాడు.

ఇదిలాఉండగా.. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో  టెస్టులో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 468 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇప్పటికే 2 వికెట్లను కోల్పోయింది. డేవిడ్ మలన్ (20), హసీబ్ హమీద్ (0) లు నిష్క్రమించారు.  రోరీ బర్న్స్ (30 నాటౌట్), జో రూట్ (6 నాటౌట్) ఆడుతున్నారు. 

click me!