TATA IPL 2022: ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ముందుకు సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కు గాయమైంది.
ఐపీఎల్-2022 సీజన్ ను ఓటములతో మొదలుపెట్టి తర్వాత రెండు వరుస విజయాలతో గాడిలో పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ షాక్ తగిలింది. తన స్పిన్ తో ప్రత్యర్థులను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్ లో కూడా విలువైన పరుగులు సాధిస్తున్న ఆ జట్టు ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు.
27
సోమవారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సందర్భంగా సుందర్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని టీమ్ హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గాయం కారణంగా అతడు పలు మ్యాచులకు అందుబాటులో ఉండడని కూడా మూడీ పేర్కొన్నాడు.
37
మూడీ మాట్లాడుతూ.. ‘వాషింగ్టన్ సుందర్ కుడి చేతి బొటనవేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. గాయం తీవ్రత ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేం. అయితే రాబోయే వారం రోజుల పాటు అతడికి విశ్రాంతి అవసరం. ఎస్ఆర్హెచ్ ఆడబోయే తదుపరి రెండు మ్యాచులకు అతడు అందుబాటులో ఉండటం అనుమానమే..’ అని తెలిపాడు.
47
సీజన్ లో ఓపెనింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన సన్ రైజర్స్ 61 పరుగుల తేడాతో ఓడగా.. రెండో మ్యాచులో లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక చెన్నైతో జరిగిన మూడో మ్యాచులో నెగ్గి విజయాల బాట పట్టిన ఆరెంజ్ ఆర్మీ.. సోమవారం ఈ సీజన్ లో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న గుజరాత్ కు ఓటమి రుచి చూపించింది.
57
రాజస్థాన్ తో మ్యాచులో 3 వికెట్లు తీసుకున్న వాషింగ్టన్ సుందర్.. తర్వాత మూడు మ్యాచులలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ తో జరిగిన మ్యాచులో 3 ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చాడు. వికెట్లేమీ తీయకున్నా.. పొదుపుగా బౌలింగ్ చేసి గుజరాత్ ను కట్టడి చేశాడు.
67
ఇదిలాఉండగా... ఈ సీజన్ లో సన్ రైజర్స్ తర్వాత ఈనెల 15న కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొనబోతుంది. అనంతరం ఏప్రిల్ 17న పంజాబ్ తో ఆడనుంది. ఈ రెండు మ్యాచులకు వాషింగ్టన్ ఆడేది అనుమానమే.
77
వాషింగ్టన్ స్థానంలో శ్రేయస్ గోపాల్ గానీ, జగదీష్ సుచిత్ ను గానీ తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది. ఇక ఇప్పటికే జట్టులో ఉన్న అబ్దుల్ సమద్, ఏయిడెన్ మార్క్రమ్ లు కూడా బౌలింగ్ చేయగలరు. మరి సన్ రైజర్స్ సారథి కేన్ మామ ఎవరితో వెళ్తాడో వేచి చూడాలి.