ఆ ఒక్క తప్పే, టీమిండియా కొంపముంచింది... టీ20 వరల్డ్‌కప్‌లో భారతజట్టు ప్రదర్శనపై మహేళ జయవర్థనే కామెంట్స్..

First Published Nov 3, 2021, 4:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని హాట్ ఫెవరెట్‌గా ఆరంభించింది టీమిండియా. ఐపీఎల్‌లో మనోళ్లు ఫుల్లుగా ప్రాక్టీస్ చేసేయడం, మెంటర్‌గా ధోనీ నియామకం, వార్మప్ మ్యాచుల్లో పర్ఫామెన్స్... ఇక భారత జట్టుకి తిరుగే ఉండదని అనిపించింది. అయితే మొదటి రెండు మ్యాచుల తర్వాత సీన్ రివర్స్...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

ముఖ్యంగా న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలు, టీమిండియా ప్రదర్శనను ఘోరంగా దెబ్బతీశాయి.. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనే దీని గురించి కామెంట్ చేశాడు...

‘కొన్నిసార్లు ఎక్కువ ఆప్షన్లు ఉన్నా ఇబ్బందే. టీమిండియా పరిస్థితి అదే. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడంలో తప్పు లేదు. అయితే మొదటి ముగ్గురు టాపార్డర్‌ను మాత్రం మార్చకుండా ఉంచాలి...

ఏ జట్టుని చూసినా, వాళ్లు టాపార్డర్‌లో ముగ్గురిని మాత్రం మార్చకుండా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఎలాంటి మ్యాచ్‌లో అయినా ఆ బాధ్యత తీసుకుని, టెంపో తీసుకొచ్చే ప్లేయర్లు వాళ్లే...

ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ప్లేయర్‌ని గ్లూ పెట్టి అతికించేసినట్టు ఫిక్స్ అవ్వాలి. అప్పుడే ఆ స్థానాల్లో ఆడే వారికి విలువ ఇచ్చినట్టు...

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చేసిన ఆ తప్పే, వారి కొంపముంచింది. విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌ని ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌లో వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి...

కావాలంటే కెఎల్ రాహుల్‌ను టూ డౌన్‌లో పంపాల్సింది. ఎందుకంటే అతను ఆ పొజిషన్‌లో కుదురుకోగలడు. కానీ ఐపీఎల్‌ పర్ఫామెన్స్ చూసి, టీమిండియా అలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు...

అయితే టీ20 లీగుల్లో ఓపెనర్లుగా వచ్చే అందరూ, తమ దేశాల తరుపున ఓపెనింగ్ చేయరు. ఎందుకంటే లీగ్ క్రికెట్ వేరు, దేశానికి ఆడడం వేరు... ఈ విషయంలో టీమిండియా ఇంకా గుర్తించినట్టు లేదు...

ఇండియాకి మంచి ఆరంభం దొరికితే, దాన్ని భారీ స్కోరు మలిచేందుకు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయొచ్చు. కెఎల్ రాహుల్‌కి బదులుగా రిషబ్ పంత్‌ను టూ డౌన్‌లో తీసుకురావచ్చు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసే కంటే, ఒకే ఒక్క ప్లేస్‌లో ప్లేయర్‌ని మార్చి ఉంటే సరిపోయేది. ఇషాన్ కిషన్‌ని ఆడించాలని అనుకుంటే, రోహిత్ శర్మను పక్కనబెట్టాల్సింది...

రోహిత్ కచ్ఛితంగా కావాలనుకుంటే అతనితో పాటు ఇషాన్ కిషన్‌ను పంపి ఓపెనింగ్ చేయించి, కెఎల్ రాహుల్‌ను తప్పించాల్సింది. కానీ టీమిండియా అలా చేయలేదు...

ఓపెనర్లను మార్చడం వల్ల వన్‌డౌన్‌లో రోహిత్ శర్మ వచ్చాడు. అతనికి ఆ ప్లేస్‌‌లో పెద్దగా అనుభవం లేదు. విరాట్ కోహ్లీ టూ డౌన్‌లో వచ్చాడు. అతనికీ ఆ ప్లేస్‌లో పెద్దగా అనుభవం లేదు...

మొత్తానికి ముఖ్యమైన మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది... వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో ప్రయోగాలకు పోకుండా అచ్చొచ్చిన ప్లేయర్లను ఆడించడమే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు జయవర్థనే...

click me!