వాళ్లేమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా..? వాళ్లకూ గాయాలౌతాయి : పాకిస్తాన్ జట్టుపై పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

First Published Dec 18, 2022, 4:39 PM IST

పాకిస్తాన్  క్రికెట్ జట్టు ఇటీవల కాలంలో స్వదేశంలో  ఆడిన కీలక సిరీస్ లను కూడా కోల్పోయింది.  ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్తాన్ తో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్ తో  టెస్టు సిరీస్ లు ఓడటంతో ఆ జట్టు కూర్పుపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

టీ20 ప్రపంచకప్ కు ముందు గానీ  తాజాగా ఇంగ్లాండ్ తో  టెస్టు సిరీస్ లో  గానీ  ఆ జట్టు కీలక పేసర్లు గాయంతో సతమతమయ్యారు. ముఖ్యంగా  పాకిస్తాన్ జట్టు ఇటీవల కాలంలో బాగా ఆదారపడ్డ  యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది.. టీ20 ప్రపంచకప్ కు ముందు గాయపడ్డాడు. తర్వాత అతి కష్టమ్మీద ఆ టోర్నీలో ఆడి మళ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు గాయంతో తప్పుకున్నాడు. 

అఫ్రిది తప్పుకోవడంతో హరీస్ రౌఫ్,  నసీమ్ షా ల మీద పాకిస్తాన్ భారీ ఆశలే పెట్టుకుంది.  కానీ  తొలి టెస్టులో ఆడిన ఈ ఇద్దరూ  పెద్దగా  సఫలం కాలేదు.   ఫ్లాట్ వికెట్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఇక తొలి టెస్టులోనే  నసీమ్ షా తో పాటు హరీస్ రౌఫ్ గాయంతో తప్పుకున్నారు.  దీంతో పాకిస్తాన్ అంతగా అనుభవం లేని  పేసర్లతో  సిరీస్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కరాచీ వేదికగా జరుగుతున్న  మూడో టెస్టు ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజాను కలిసిన విలేకరులు కూడా  ఇదే ప్రశ్న  అడిగారు.  అసలు పాక్ పేసర్లకు ఏమైంది..? వాళ్లకు వరుసగా గాయాలు ఎందుకవుతున్నాయి. ఫిట్నెస్  లెవల్స్ ను వాళ్లు ఎందుకు అందుకోవడం లేదు..? అని నిలదీశారు. 

ఈ ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన రమీజ్ రాజా.. ‘చూడండి.. ప్రపంచంలో క్రికెట్ ఆడుతున్న ప్రతీ ఒక్కరికీ  గాయాలవడం సహజం.  ఇతర జట్లలోని  బౌలర్లు కూడా గాయపడుతున్నారు.  పాకిస్తాన్ బౌలర్లు కూడా అంతే. గాయాలు చాలా సహజం. మేం  బౌలర్లను ఐదు రోజుల క్రికెట్ ఆడించి ఆ తర్వాత  టీ20, వన్డేలకు ఆడిస్తున్నాం. 

ఫిట్నెస్ విషయంలో మేం కాస్త వెనుకబడ్డ విషయం ఒప్పుకోవాల్సిందే. అయితే దానిని అధిగమించేందుకు మేం కృషి చేస్తున్నాం. ఫాస్ట్ బౌలర్లు టీ20 వరకే ఫిట్ గా ఉండటం కాకుండా టెస్టు క్రికెట్ ఆడేందుకు కావాల్సిన ఫిట్నెస్ ను మేం అందిస్తున్నాం..’ అని  తెలిపాడు. 

ఇక పాకిస్తాన్ - ఇంగ్లాండ్ నడుమ  కరాచీ వేదికగా జరగుతున్న మూడో టెస్టులో పర్యాటక  జట్టు కూడా ఆతిథ్య జట్టు మాదిరిగానే తడబడుతున్నది.   పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో  304 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఇంగ్లాండ్ కూడా 73 ఓవర్ల ఆట ముగిసేసమయానికి 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. 

click me!