అవన్నీ పుకార్లే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడడానికి విరాట్ ఎదురుచూస్తున్నాడు... అసలు కారణం ఇదే..

First Published Dec 14, 2021, 1:51 PM IST

రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కి దూరమైన కొద్ది గంటల్లోనే, విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడనే వార్త రావడం క్రికెట్ ప్రపంచంలో అలజడి రేపింది. విరాట్ కెప్టెన్సీలో రోహిత్, రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడడానికి ఇష్టపడడం లేదంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

ఎమ్మెస్ ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా, అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ ఉన్నాడు రోహిత్ శర్మ...

రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో అవకాశాలు వచ్చినా... రోహిత్ శర్మ స్టార్‌ ప్లేయర్‌గా ఎదిగింది మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే...

అయితే ఒకే టీమ్‌లో ఉన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్లకు కెప్టెన్సీ విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, చాలా ఏళ్ల నుంచే వినిపిస్తున్న మాట. అయితే స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు రోహిత్, విరాట్...

ఆ సంతోషం ఏడాదైనా ఉండకుండానే టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని రోహిత్ శర్మ పట్టుబట్టాడని వార్తలు రావడంతో టీమిండియాలో చీలికలు వచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి...

విరాట్ కోహ్లీని సెలక్టర్లే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని, టీ20 కెప్టెన్‌గా తప్పుకోవద్దని స్వయంగా తాను అడిగినా అతను వినలేదంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేయడంతో ఈ వార్తలకు మరింత ఊపునిచ్చినట్టైంది...

అయితే అందరూ అనుకుంటున్నట్టుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఎలాంటి వైరం లేదని, నిజానికి ఈ ఇద్దరూ కలిసి ఆడడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలియచేశాడు ఓ బీసీసీఐ అధికారి...

‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. రోహిత్ శర్మకు టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ ఇవ్వడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు కూడా. ఆసీస్ టూర్‌లో రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా చేయమని సూచించింది కూడా అతనే...

అయితే గాయాలు చెప్పి అవ్వవు కదా... అనుకోకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్‌కి గాయం కావడంతో సౌతాఫ్రికాతో సిరీస్ ఆడడం లేదు. అంతే తప్ప, కోహ్లీ మీద కోపంతో కాదు...

అలాగే కూతురు పుట్టిన తర్వాత ఆమెతో కలిసి గడపడానికి విరాట్ కోహ్లీకి పెద్దగా సమయం దొరకలేదు. ఐపీఎల్, ఇంగ్లాండ్ టూర్, టీ20 వరల్డ్‌కప్ అంటూ బిజీ బిజీ షెడ్యూల్‌లో గడిపింది భారత జట్టు...

అందుకే కనీసం కూతురి బర్త్ డే సమయానికైనా తనతో ఉండాలని విరాట్ కోహ్లీ భావించాడు. ఈ ఏడాది మొత్తం భారత జట్టు బిజీ షెడ్యూల్‌ ఆడనుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేదు...

ఒక్క రెండు సిరీస్‌లలో కలిసి ఆడలేనంత మాత్రాన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య వైరం ఉందని అనుకుంటే ఎలా? రోహిత్ శర్మ టెస్టులు ఆడతాడు, విరాట్ కోహ్లీ వన్డే, టీ20లు ఆడాలి...ఈ విషయాన్ని గుర్తుంచుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి...

click me!