అరంగేట్రంలోనే అదరగొట్టేసిన 19ఏళ్ల బ్యాట్స్‌మెన్.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్

First Published | Sep 7, 2024, 12:45 PM IST

Musheer Khan Breaks Sachin Tendulkar Record : దులీప్ ట్రోఫీ అరంగేట్రంతోనే ఎలైట్ లిస్ట్ లో ఉన్న‌ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు 19 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ ముషీర్ ఖాన్. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడైన అత‌ను  ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్ లో దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే 181 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
 

Sachin Tendulkar, Musheer Khan, Ranji Trophy

Musheer Khan Breaks Sachin Tendulkar Record : భార‌త్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే అనేక రికార్డులు సృష్టించిన లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని క్రికెట్ లో అడుగుపెడుతున్న వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అరంగేట్రం మ్యాచ్ ల‌లోనే అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొడుతున్నారు. 

అలాంటి వారిలో యంగ్ ప్లేయ‌ర్ ముషీర్ ఖాన్ ఒక‌రు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడైన ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. క‌ష్ట స‌మ‌యంలో త‌న జ‌ట్టుకు నిల‌బెట్టే ఇన్నింగ్స్ తో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. 

Musheer Khan, Sarfaraz Khan, duleep trophy 2024

ఇదే క్ర‌మంలో లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును కూడా ముషీర్ ఖాన్ బ‌ద్ద‌లు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గ‌జ ప్లేయ‌ర్ల ఎలైట్ లిస్టులో చేర‌డంతో పాటు ఇండియా బీ జ‌ట్టు ట్రబుల్ షూటర్ గా నిరూపించుకున్నాడు. ఆ మొత్తం జట్టు గౌరవాన్ని కాపాడాడు. 

సెప్టెంబరు 5 నుండి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో బెంగ‌ళూరు వేదిక‌గా ఇండియా ఏ-ఇండియా బీ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఇండియా బీ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయ‌ర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ ల‌తో పాటు అభిమ‌న్యూ మితున్, నితీష్ కుమార్ రెడ్డిలు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. 


Musheer Khan

స్వ‌ల్ప స్కోర్ ల‌కే  వికెట్లు కోల్పోయారు. వ‌చ్చిన‌వాళ్లు వ‌చ్చిన‌ట్టుగా క్రీజులో ఎక్కువ సేపు నిల‌వ‌కుండా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టారు. 94 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర క‌ష్టాల్లో ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన 19 ఏళ్ల ముషీర్ ఖాన్ అద్బుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. త‌న అరంగేట్రం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని విధంగా మార్చుకున్నాడు. 

94/7 ప‌రుగుల‌తో ఉన్న స్కోరు బోర్డును ఏవ‌రూ ఊహించ‌ని విధంగా 321 ప‌రుగులకు తీసుకెళ్లాడు. ఆ జ‌ట్టుకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు. తొలిరోజు అద్భుతమైన సెంచరీ సాధించిన ముషీర్ మరుసటి రోజు కూడా అదే జోరును కొన‌సాగించాడు.

Musheer Khan

ముషీర్ ఖాన్ మరుసటి రోజు కూడా బ్యాటింగ్ జోరును కొన‌సాగించిన తన తొలి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 181 పరుగులు చేశాడు. దీంతో ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. ముషీర్ ఖాన్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఇండియా బీ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు బోర్డుపై 321 పరుగులు చేసింది. 

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సమయంలో స‌చిన్ 159 పరుగులు చేశాడు. ఇప్పుడు ముషీర్ ఖాన్ స‌చిన్ రికార్డును బ్రేక్ చేసి త‌న అరంగేట్రం మ్యాచ్ లో 181 ప‌రుగులు చేశాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా బాబా అపరాజిత్ టాప్ లో ఉన్నారు. ఆ త‌ర్వాత యష్ ధుల్, ముషీర్ ఖాన్ లు ఉన్నారు. 

తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో అద‌ర‌గొట్ట‌డంతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అందరి దృష్టి ముషీర్ ఖాన్ పైనే పడింది. రెండో ఇన్నింగ్స్ తో పాటు దులీప్ ట్రోఫీ రాబోయే మ్యాచ్ లలో ముషీర్ ఖాన్ ఇదే జోరును కొన‌సాగిస్తే భార‌త జ‌ట్టు ఎంట్రీ ఈ ఏడాది జ‌ర‌గ‌డం ప‌క్కా. 

దులీప్ ట్రోఫీ చ‌రిత్ర‌లో అరంగేట్రం మ్యాచ్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు: 

బాబా అపరాజిత్ - 212
యష్ ధుల్- 193
ముషీర్ ఖాన్ - 181
సచిన్ టెండూల్కర్- 159

Latest Videos

click me!