ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగం కానున్న మిథాలీ రాజ్.. కానీ ప్లేయర్ గా కాదు..!

First Published Jan 28, 2023, 12:20 PM IST

WPL: టీమిండియా మాజీ సారథి, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న  మిథాలీ రాజ్  త్వరలో మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనుంది. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఆమె  భాగం కానుంది. 

భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ గతేడాది  అంతర్జాతీయ  క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే  ఇంటర్నేషన్ లెవల్ నుంచి తప్పుకున్నా తాను ఉమెన్స్ ఐపీఎల్ లో పాల్గొంటానని గతంలో చెప్పింది.  బీసీసీఐ ఎప్పుడు ప్రకటించాని  తాను  ఆడటానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది.  
 

కాగా బీసీసీఐ ఇటీవలే మహిళల  ఐపీఎల్ కు సంబంధించిన  కీలక వివరాలను  వెల్లడించింది. తొలి సీజన్ లో ఐదు జట్లు పాల్గొననుండగా   ఐపీఎల్  టీమ్స్ కు చెందిన మూడు జట్లు.. మూడు ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.   ప్రముఖ వ్యాపారవేత్త  అదానీకి చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని  చేజిక్కించుకుంది.   

ఇదిలాఉండగా మార్చి నుంచి మొదలుకాబోయే డబ్ల్యూపీఎల్ లో మిథాలీ   ఆడాలని చూసినా ఆమెతో మళ్లీ బ్యాట్ పట్టించడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా లేవని సమాచారం.  నలభై ఏండ్ల వయసులో ఉన్న మిథాలీని తీసుకుని క్రికెట్ ఆడించడం  వల్ల  తమకు వచ్చే  ఉపయోగమేమీ లేదని  ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆమెను క్రికెటర్ గా కాకుండా మెంటార్ గా తీసుకునేందుకు   పలు ఫ్రాంచైజీలు  ఆసక్తి చూపిస్తున్నాయట.  అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అదానీ   స్పోర్ట్స్ లైన్.. మిథాలీని తమ టీమ్ కు మెంటార్ గా నియమించుకోనున్నదని తెలుస్తున్నది. 

ఇదే విషయమై ఓ జాతీయ  న్యూస్ ఛానెల్ తో మిథాలీ ఫ్యామిలీ లోని ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘మిథాలీ ఈ లీగ్ లో ఆడాలని అనుకుంది. కానీ ప్రాంచైజీలు ఆమె ను క్రికెటర్ గా కంటే మెంటార్ గా నియమించుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ఆమె కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది.   గుజరాత్ టీమ్ కు ఆమె మెంటార్ గా వ్యవహరించనుంది..’అని  తెలిపారు.  

ఇక డబ్ల్యూపీఎల్ లో ఐదు  ఫ్రాంచైజీలను బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ కూడా జరుగనుంది.    మార్చి మొదటివారంలో  ఈ లీగ్ ను మొదలుపెట్టి అదే నెల ఆఖరువరకు పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. 

click me!