ఇంకా ఫిట్‌నెస్ నిరూపించుకోని కెఎల్ రాహుల్... ఆఖరి నిమిషాల్లో మరో షాక్ తప్పదా...

First Published Aug 11, 2022, 10:52 AM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియాకి ఇప్పటికే రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా గాయపడి, ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాయి. అయితే ఇది ఇంతటిలో ఆగేలా కనిపించడం లేదు... ఆసియా కప్‌ టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్, ఇంకా ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేదట...
 

Image credit: PTI

బీసీసీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం ఏ ప్లేయర్ అయినా టీమిండియా తరుపున ఆడాలంటే ఎన్‌సీఏలో నిర్వహించే ఫిట్‌నెస్ టెస్టులో తప్పక పాస్ కావాల్సి ఉంటుంది. ఈ టెస్టు పాస్ కాకపోవడం వల్లే దేశవాళీ టోర్నీల్లో ఎన్ని పరుగులు చేస్తున్నా పృథ్వీషాని పట్టించుకోవడం లేదు సెలక్టర్లు...

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు కెఎల్ రాహుల్. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎన్నికైన కెఎల్ రాహుల్, సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయం కారణంగా తప్పుకున్నాడు...

జర్మనీ వెళ్లి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని వచ్చిన కెఎల్ రాహుల్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొంటాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో రాహుల్ కరోనా బారిన పడడంతో ఆ సిరీస్‌కి కూడా దూరమయ్యాడు కెఎల్ రాహుల్...

కరోనా నుంచి కోలుకున్నా, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కాస్త సమయం పడుతుందనే ఉద్దేశంతో జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్‌కి కూడా కెఎల్ రాహుల్‌ని దూరంగా పెట్టింది భారత క్రికెట్ బోర్డు...

K L Rahul

ఆసియా కప్ 2022 టోర్నీ ద్వారా కెఎల్ రాహుల్, దాదాపు ఐదు నెలల తర్వాత టీమిండియా తరుపున ఆడబోతున్నాడు. అయితే ఆసియా కప్‌లో ఆడాలంటే కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది...

Image Credit: PTI

యూఏఈలో జరిగే ఆసియా కప్ కోసం వారం ముందుగానే ఫ్లైట్ ఎక్కబోతోంది భారత జట్టు. దీంతో కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవుతాడా? లేదా? ఒకవేళ కాకపోతే అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారాయి... 

సౌతాఫ్రికాతో సిరీస్‌లో జరిగినట్టు కెఎల్ రాహుల్ ఆఖరి నిమిషంలో షాక్ ఇస్తే... ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది..  వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్ తప్పుకుంటే, హార్ధిక్ పాండ్యాకి లేదా రిషబ్ పంత్‌కి మరోసారి టీమిండియా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కుతుంది.

click me!