IPL2021 CSK vs RR: రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ... రాయల్స్ ముందు భారీ టార్గెట్...

First Published Oct 2, 2021, 9:33 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్... కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదుచేసుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చి, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సెంచరీ మార్కు అందుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్... దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది సీఎస్‌కే...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కి మరోసారి శుభారంభం అందించారు ఓపెనర్లు. మొదటి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన డుప్లిసిస్, రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఫేజ్ 2లో పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్న సురేష్ రైనా, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చాడు. అయితే 5 బంతుల్లో 3 పరుగులు చేసి తెవాటియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు రైనా...

Ruturaj Gaikwad-Photo Credit BCCI

17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా రాహుల్ తెవాటియా బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు...

Ruturaj Gaikwad

4 బంతుల్లో 2 పరుగులు చేసిన అంబటి రాయుడు, చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు... ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో కుదురుకుపోయిన రుతురాజ్ గైక్వాడ్... బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా, ఆఖరి రెండు బంతులు ఉన్న సమయంలో  గైక్వాడ్‌కి స్ట్రైయిక్ వచ్చింది. ఐదో బంతికి పరుగులేమీ రాకపోగా ఆఖరి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తిచేసుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్..

Ruturaj Gaikwad

60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఈ సీజన్‌లో సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, జోస్ బట్లర్ తర్వాత సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు..

సీఎస్‌కే తరుపున మురళీ విజయ్, సురేష్ రైనా, అంబటి రాయుడి తర్వాత సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్... 

click me!