Published : Apr 18, 2026, 05:37 PM ISTUpdated : Apr 18, 2026, 05:45 PM IST
CSK vs SRH, IMD Rain Alert : క్రికెట్ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం ఏమైనా ఆటంకం కలిగిస్తుందా…? అసలు నగరంలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందంటే..
Indian Premier League 2026 : అసలే వీకెండ్... అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్. ఇంకేముంది... అన్నీ రెడీ చేసుకుని ఐపిఎల్ మ్యాచ్ చూసేందుకు తెలుగు ప్రజలు సిద్దమయ్యారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణం క్రికెట్ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నగరంలో పలుచోట్ల వర్షం మొదలవగా ఇది ఎక్కడ ఉప్పల్ స్టేడియంకు చేరి మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తుందోనని కంగారుపడిపోతున్నారు.
25
హైదరాబాద్ లో వర్షం...
తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం సూరీడు నిప్పులు చేరిగాడు... నగరవాసులను ఎండలు అల్లాడించాయి. అయితే సమయం గడుస్తున్నకొద్ది ఎండల తీవ్రత తగ్గి సాయంత్రానికి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలయ్యింది... ఇది నగరవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రంతో పాటు నిపుణులు చెబుతున్నారు.
రాబోయే రెండుమూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) పరిధిలో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
35
SRH vs CSK మ్యాచ్ కు వర్షం ఆటకం కలిగిస్తే... ఏం చేస్తారు..?
సాధారణంగా ఐపిఎల్ మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం మొదలైతే కొద్దిసేపు వేచిచూస్తారు. నిర్ణీత సమయం అంటే దాదాపు గంటసేపు వర్షం తగ్గుతుందేమో చూస్తారు. గంటలోపు తగ్గితే ఓవర్లను కుదించకుండానే మ్యాచ్ కొనసాగిస్తారు. వర్షం గంటకంటే ఎక్కువసేపు మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తే ఓవర్లను కుదిస్తారు... రెండో ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడితే డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించి ఫలితం తేలుస్తారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం నేపథ్యంలో పైన పేర్కొన్న వాటిలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ భారీ వర్షం కురిసి మైదానం ఆటకు అనుకూలించకపోతే రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే జరిగితే హైదరాబాద్, చెన్నై జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాల ప్రకారం... ఈ సాయంత్రం హైదరాబాద్ లోని మలక్ పేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, చార్మినార్, ఆల్వాల్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీన్నిబట్టి ఉప్పల్ లో వర్షం కురిసే అవకాశాలు తక్కువే.
55
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
రాబోయే కొన్నిగంటల్లో హైదరాబాద్ లోనే కాదు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నగర శివారుజిల్లాలు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డిలతో పాటు వికారాబాద్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక కామారెడ్డి, సంగారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ వర్షాలకు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడైతే ప్రమాదకరంగా మారతాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.