జనాలు చచ్చిపోతుంటే, ఐపీఎల్ కోసం వేల కోట్లు ఖర్చుపెడతారా?... ఆసీస్ ప్లేయర్ ఆండ్రూ టై...

First Published | Apr 26, 2021, 7:37 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు నుంచి ఏకంగా నలుగురు ఫారిన్ ప్లేయర్లు స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయం కారణంగా సీజన్ నుంచి దూరం కాగా లివింగ్‌స్టోన్, ఆండ్రూ టై, దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు భయపడి స్వదేశానికి పయనమయ్యారు. 

ఐపీఎల్ 2018 సీజన్‌లో పంజాబ్ జట్టు తరుపున ఆడి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ అందుకున్న ఆండ్రూ టై, 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశానికి పయనమయ్యాడు..కరోనా భయంతో స్వదేశానికి పయనమైన ఆండ్రూ టై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ఓ ప్లేయర్‌గా భద్రత గురించి ఆలోచిస్తే, మేం ఇప్పుడు చాలా సేఫ్‌గా ఉన్నాం. కానీ ఇక్కడే ఉంటే ఇలాగే సేఫ్‌గా ఉండగలమా... మా సేఫ్టీ కంటే భారత్ ఆలోచిస్తున్న విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది...

ఐపీఎల్ కోసం ప్రభుత్వం, ఫ్రాంఛైజీలు, స్పాన్సర్ కంపెనీలు కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఓ వైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక, సరైన సదుపాయాలు లేక జనాలు ప్రాణాలు కోల్పోతుంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా...
కరోనా భయంతో వణికిపోతున్న జనాల ఒత్తిడి తగ్గించేందుకు, వారికి కావాల్సిన రిలీఫ్ ఇవ్వడానికి ఆటలు ఎంతైనా అవసరం. కానీ పరిస్థితి అధ్వాన్నంగా మారి, జనాలు పిట్టల్లా రాలిపోతుంటే ఇది ఇంకా కొనసాగించడం అవసరమా...
ఇది నా అభిప్రాయం మాత్రమే, అందరూ ఇలాగే ఆలోచిస్తారని అనుకోను. అన్ని కోణాల్లో అందరి అభిప్రాయాలకు నేను విలువనిస్తాను... ’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, లెజెండరీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కలకలం రేపుతుంటే, ఐపీఎల్ ఇంకా కొనసాగించడం అవసరమా? అంటూ ప్రశ్నించాడు గిల్లీ...
ఆండ్రూ టైతో పాటు ఆస్ట్రేలియా ప్లేయర్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా కూడా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే స్వదేశానికి పయనమై వెళ్లారు...

Latest Videos

click me!