రోహిత్ శర్మ ఖాతాలో 15 వేల పరుగులు... నాలుగో టెస్టులో మనోళ్ల బ్యాటింగ్‌పైనే భారమంతా...

First Published Sep 3, 2021, 11:16 PM IST

నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 56 పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు... దీంతో మూడో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ చేసే పరుగులే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి...

రోహిత్ శర్మ 56 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు... అండర్సన్ వేసిన రెండో ఓవర్‌లోనే రోరీ బర్న్స్ క్యాచ్ వదిలేయడంతో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు రోహిత్ శర్మ...

భారత ఓపెనర్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన 8వ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్...

సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో టాప్‌లో ఉంటే, రాహుల్ ద్రావిడ్ 24064, విరాట్ కోహ్లీ 23049, సౌరవ్ గంగూలీ 18433, ఎమ్మెస్ ధోనీ 17092, వీరేంద్ర సెహ్వాగ్ 16892, అజారుద్దీన్ 15593 పరుగులతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు...

ప్రస్తుత తరంలో క్రికెట్‌లో కొనసాగుతున్నవారిలో 15 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసుకున్న ఏడో ప్లేయర్ రోహిత్. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, రాస్ టేలర్, జో రూట్, కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్... రోహిత్ శర్మ కంటే ముందున్నారు..

అత్యంత వేగంగా 15 వేల అంతర్జాతీయ పరుగులు అందుకున్న ఐదో భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ 333 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకోగా... సచిన్ టెండూల్కర్ 356, రాహుల్ ద్రావిడ్ 368, వీరేంద్ర సెహ్వాగ్ 371 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.

తన 396 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ 400 ఇన్నింగ్స్‌ల్లో రికార్డును బ్రేక్ చేశాడు... 

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా... జానీ బెయిర్ స్టో, మొయిన్ ఆలీలతో కలిసి 70+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓల్లీ పోప్ ఇంగ్లాండ్‌కి మంచి స్కోరురో అందించాడు...

ఆఖర్లో 10వ వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించిన క్రిస్ వోక్స్, మెరుపు హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 99 పరుగులకి పెంచాడు... తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 290 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 56 పరుగుల దూరంలో ఉన్న భారత జట్టు, తొలి సెషన్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తుందనేదానిపైనే మ్యాచ్ ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంది... 

click me!