అఫ్రిదికి భయపడాల్సిన అవసరం లేదు.. ఇండియా-పాక్ మ్యాచ్‌కు ముందు రోహిత్ సేనకు పాకిస్తాన్ మాజీ ఆటగాడి సూచన

First Published Aug 10, 2022, 1:35 PM IST

Asia Cup 2022: ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కావాల్సిఉండగా 28వ తారీఖున దాయాదుల పోరు జరగనుంది. గతేడాది టీ20  ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి బాటలు వేసినవారిలో ముఖ్యుడు షహీన్ షా అఫ్రిది. 

గతేడాది టీ20  ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోవడానికి కారణమయ్యాడు పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది. ఆ మ్యాచ్ లో ఈ యువ పేసర్ 4 ఓవర్లు వేసి  31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీల వికెట్లు అఫ్రిదికే దక్కాయి. రాహుల్ ను ఔట్ చేసిన బంతి అయితే హైలైట్. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ ఆసియా కప్ వేదికగా తలపడబోతున్నాయి. 

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కావాల్సిఉండగా 28వ తారీఖున దాయాదుల పోరు జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరు జట్ల క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఈ మ్యాచ్ మీద ఎవరికి తోచిన రీతిలో వాళ్లు విశ్లేషణలు చేస్తున్నారు. 

తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ లో భారత జట్టు పాక్ తో ఆడబోతున్న మ్యాచ్ లో అఫ్రిదిని చూసి భయపడాల్సిన అవసరమేమీ లేదని అన్నాడు. టీమిండియా టాపార్డర్ కాస్త జాగ్రత్తగా ఆడితే అఫ్రిదిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా  కనేరియా మాట్లాడుతూ.. ‘షహీన్ అఫ్రిదిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎలైట్ బ్యాటర్ల లిస్ట్ లో ఉన్నారు.  వాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. బంతిని స్వింగ్ చేస్తున్నాడా..? లేదా..? అనేది గమనించాలి. 

బాడీతో, కాళ్లతో కాకుండా   బ్యాట్ తో బంతులను ధీటుగా ఎదుర్కోవాలి.  ఈ మ్యాచ్ లో అఫ్రిది బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. స్క్వేర్ లెగ్ దిశగా అతడు ఆడే ఫ్లిక్ స్ట్రోక్స్ ను ఎలా ఆడతాడో చూడాలి..’ అని అన్నాడు. 

ఇక ఆసియా కప్ దినేశ్ కార్తీక్ కు కీలకం కానున్నదని కనేరియా అన్నాడు. ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అతడు.. ముందు ఆసియా కప్ ను భారత్ కు అందిస్తే సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా పోతుందని  చెప్పాడు. సెలక్టర్లతో పాటు క్రికెట్ అభిమానులు అతడి ఫామ్, ఫిట్నెస్ ను చూస్తున్నారని, అతడు ఆసియా కప్ లో రాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. 

click me!