హైదరాబాద్‌కి ఘోర అవమానం! ఒకే ఒక్క పాయింట్‌తో ప్లేట్ గ్రూప్‌కి.. మరీ ఇంత దారుణంగా..

First Published Jan 27, 2023, 1:31 PM IST

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకి ఘోర అవమానం ఎదురైంది. 2022-23 రంజీ సీజన్‌లో ఒకే ఒక్క పాయింట్‌ దక్కించుకున్న హైదరాబాద్, వచ్చే సీజన్‌లో మేఘాలయ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి చిన్న జట్లతో కలిసి ప్లేట్ గ్రూప్‌లో తలబడబోతోంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కి దక్కిన ఆ ఒక్క పాయింట్ కూడా లక్కీగా బ్యాడ్ లైట్ కారణంగా వచ్చిందే...
 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవినీతి, అవకతవకలకు రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆటతీరే ప్రత్యేక్ష సాక్ష్యం. టాలెంట్ ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి, సిఫారసులకు, బంధుమిత్రుల కొడుకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన హైదరాబాద్... రంజీలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది...

1934లో ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ టీమ్, 1937-38 సీజన్‌లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 1986-87 సీజన్‌లో రంజీ విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది...

1986లో ఇరానీ కప్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ జట్టు, ఇప్పటిదాకా విజయ్ హాజారే ట్రోఫీ కానీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ కానీ గెలవలేకపోయింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 2009లో ఫైనల్ చేరినా వన్డే ఫార్మాట్‌లో జరిగే విజయ్ హాజారే ట్రోఫీలో హైదరాబాద్ ప్రదర్శన తీవ్రంగా నిరాశజనకంగా ఉంది...

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో తమిళనాడుతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాడ్ లైట్ కారణంగా బతికిపోయింది హైదరాబాద్. నాలుగో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తమిళనాడు, కేవలం 7 ఓవర్లలో 108 పరుగులు చేసింది. మనోళ్లు స్లో ఓవర్ రేటు కారణంగా సమయం అయిపోవడం, వాతావరణం సహకరించడంతో మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు అంపైర్లు...

Image credit: PTI

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది హైదరాబాద్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి యశస్వి జైస్వాల్ 162, అజింకా రహానే 204, సర్ఫరాజ్ ఖాన్ 126 పరుగులు చేసి 651 పరుగుల భారీ స్కోరు అందించారు. 
 

ముంబై 651/6 స్కోరుకి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా మనోళ్లు, రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా ఇందులో 80 శాతం స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకి ఆలౌట్ అయిన హైదరాబాద్, ఫాలోఆన్ ఆడి 220 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
 

ఈశాన్య రాష్ట్రం అస్సాంతో జరిగిన మ్యాచ్‌లోనూ 18 పరుగుల తేడాతో ఓడింది హైదరాబాద్. తమిళనాడు వంటి మిగిలిన జట్లన్నీ అస్సాంతో ఆడుకుని రికార్డులు క్రియేట్ చేస్తే, హైదరాబాద్.. ఈశాన్య జట్లపై కూడా గెలవలేకపోయిందంటే భాగ్య నగర టీమ్ ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...
 

ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్, సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తయిన హైదరాబాద్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఓడి... 7 మ్యాచుల్లో 6 పరాజయాలతో ఎలైట్ గ్రూప్ బీలో ఆఖరి స్థానంలో నిలిచింది...
 

ఆఖరికి నాగాలాండ్ కూడా 2 మ్యాచులను డ్రా చేసుకుంటే హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క పాయింట్ సాధించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, ఈ వైఫల్యానికి ఏం సమాధానం చెబుతాడో చూడాలి...

click me!