ఆ విషయం నువ్వెలా చెప్తావ్..? గంభీర్ కు పరోక్షంగా చురకలంటించిన గవాస్కర్

First Published Jun 18, 2022, 2:42 PM IST

T20 World cup 2023: రీఎంట్రీలో టీమిండియా తరఫున అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ పై ఇటీవలే గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు. 

టీమిండియా నయా ఫినిషర్ దినేశ్ కార్తీక్ పై ఇటీవలే గౌతం గంభీర్ మాట్లాడుతూ.. అతడిని టీ20 వరల్డ్ కప్-2023 కి ఎంపిక చేయడం కష్టమే అని.. రెండు, మూడు ఓవర్లు మెరిపించినంత మాత్రానా సరిపోదని  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

తానైతే దినేశ్ కార్తీక్ ను ఎంపిక చేయనని.. 6,7 స్థానాలలో వచ్చే ఆటగాడు బ్యాటర్ తో పాటు బౌలర్ కూడా అయ్యుండాలని.. అప్పుడే టీమ్ సమతుల్యత బాగుంటుందని అన్నాడు. 

దినేశ్ కార్తీక్ కంటే రిషబ్ పంత్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్లు కావాలని..  రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్న టీమ్‌లో దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కాలంటే చాలా కష్టమే అని కూడా వ్యాఖ్యానించాడు. 

ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ తాజాగా గంభీర్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అతడికి చురకలంటించాడు. ‘చాలామంది  దినేశ్ కార్తీక్ ను టీ20 ప్రపంచకప్ జట్టులో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. అతడు ఆడకున్నా  జట్టులోకి తీసుకోవడమెందుకని అడుగుతున్నారు.. 

మీకెలా తెలుసు అతడు ఆడటం లేదని..? ప్రస్తుతం టీమిండియాకు అతడి వంటి ఆటగాళ్లే కావాలి. ఆటగాళ్ల ఫామ్ ను చూడండి.. వాళ్ల పేరు, ప్రఖ్యాతులు కాదు. ఫామ్ ను చూసి ఆటగాళ్లను ఎంపిక చేయండి...’ అని అన్నాడు. 

కార్తీక్ చివర్లో వచ్చి రెండు మూడు సిక్సర్లు కొట్టినంత మాత్రానా సరిపోదన్న విమర్శలకు కూడా సన్నీ బదులిచ్చాడు. ‘కార్తీక్ కు బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చేదే చాలా తక్కువ. అతడు బ్యాటింగ్ కు వచ్చేదే 6,7 స్థానాలలో..ప్రతి మ్యాచ్ లో మీరు అతడి నుంచి 50 ఆశించలేరు.. 20 బంతులాడితే 40 పరుగులు చేస్తున్నాడు. ఆ ప్రదర్శన నిలకడగా కొనసాగిస్తున్నాడు. అది చాలదా..?

ఐపీఎల్ లో అలాగే రాణించిన కార్తీక్.. ప్రస్తుతం కూడా దానిని కొనసాగిస్తున్నాడు. అందుకే అతడిని టీ20 ప్రపంచకప్-2023 కి ఎంపిక చేయాలి. అందుకు అతడు సంపూర్ణంగా అర్హుడు. ఒక వ్యక్తి వయసును చూసి కాదు. అతడి ప్రదర్శనలు చూసి జట్టులోకి తీసుకోవాలి..’ అని సన్నీ సూచించాడు.

click me!