ఇంకోసారి ఇక్కడ కనబడ్డావంటే వీపు పగిలేలా కొడతా.. విండీస్ క్రికెటర్ పావెల్ జీవితాన్ని మార్చిన పీఈ టీచర్..

First Published Dec 18, 2022, 6:55 PM IST

ఐపీఎల్ - 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించిన   వెస్టిండీస్ క్రికెటర్ రొవ్మన్ పావెల్  గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలు మార్చగల పావెల్   ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు.  తన అమ్మకు ఇచ్చిన మాట కోసం  పావెల్ చిన్నతనంలోనే పడరాని పాట్లన్నీ పడ్డాడు. 

విండీస్ హిట్టర్ రొవ్మన్ పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి  ఓ ఆసక్తికర ఘటన జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. వాస్తవానికి పావెల్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అథ్లెట్  గా గానీ లేదా  మిలిటరీలో గానీ  చేరదామని ఉండేదట.   కానీ  తన స్కూల్ లో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషనల్   (పీఈ) టీచర్ కార్ల్టన్ సోలన్..  పావెల్ లైఫ్ ను మార్చేశాడట. 

ఇదే విషయమై పావెల్ ఇటీవల స్పందిస్తూ.. ‘ఆయన  నేను క్రికెట్ ఆడటం గమనించేవాడు.  అయితే నేను  ఓసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కు వెళ్లా. అక్కడ ఆయన కూడా ఉన్నాడు.. ‘నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్..? బహుశా నువ్వు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అనుకుంటా..’ అని అన్నాడు.   నేను షాక్ అయ్యా.  
 

ఆ తర్వాత ఆయన  నాతో.. ‘నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు.  ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ను వదిలేయ్.  ఇది నీకు సెట్ అవదు.  నా మాట వినకుండా నువ్వు మళ్లీ ఇక్కడ గనక కనబడితే  నేను నిన్ను  కొడతా..’ అని  చెప్పాడు.  ‘నువ్వు రెండింటి (క్రికెట్, ట్రాక్ అండ్ ఫీల్డ్)  మీద దృష్టి సారిస్తానంటే కుదరదు.  అలా చేస్తే దేనిమీద వంద శాతం కచ్చితంగా ఆడలేవు అని’ చెప్పాడని పావెల్ వివరించాడు. ఆయన సూచనతోనే పావెల్ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నానని తెలిపాడు. 
 

ట్రాక్ అండ్ ఫీల్డ్ తో పాటు  పావెల్ కు మిలిటరీలో కూడా చేరాలని  ఉండేదట. కానీ అతడి తాత, ముత్తాతలు మాత్రం పావెల్ ను  క్రికెట్ ఆడేలా కృషి చేయమని   ప్రోత్సహించారట.  ఇక బ్రియాన్ లారా ఆటను చూస్తూ పెరిగానని, ఆయన ఆటను ఆస్వాదిస్తానని   పావెల్ చెప్పాడు. 

జమైకాలోని ఓల్డ్ హర్బర్‌లో జన్మించిన రోవ్‌మెన్ పావెల్‌కి తండ్రి లేడు. తల్లి, సోదరితో పెరిగిన పావెల్, చిన్నతరంలో కడుపునిండా తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, అతను చాలా కింది నుంచి పైకి వచ్చాడు... పేదరికాన్ని జయించడానికి ఆటను ఎంచుకున్నాడని విండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ గతంలో తెలిపిన విషయం విదితమే. 

స్కూల్‌ చదువుతున్నప్పుడే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తానని వాళ్ల అమ్మకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోవడానికే కష్టపడుతూ ఉన్నాడని బిషఫ్ చెప్పాడు. రోవ్‌మెన్ పావెల్ జీవితం చాలా చిత్రంగా ఉంటుంది. అతని జీవిత కథ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో ఓ 10 నిమిషాల వీడియో కూడా ఉందని బిషఫ్ వివరించాడు.

click me!