హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కంటే అతడే బెటర్ : భజ్జీ షాకింగ్ కామెంట్స్

First Published Nov 24, 2022, 3:55 PM IST

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్  ద్రావిడ్ పై అతడి మాజీ సహచర ఆటగాడు, మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. ద్రావిడ్ కంటే హెడ్ కోచ్ గా నెహ్రా బెటరని అభిప్రాయపడ్డాడు. 
 

భారత జట్టు టీ20 ప్రపంచకప్  సెమీస్ లో వైఫల్యం చెందిన తర్వాత టీమ్ లోని సీనియర్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ కోచింగ్ టీ20లకు తగ్గట్టుగా   లేదని.. అతడిని మార్చాలని కామెంట్స్ వినిపించాయి.  అలా కామెంట్ చేసినవారిలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఒకడు. 
 

తాజాగా  భజ్జీ మరోసారి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అబుదాబి టీ20 లీగ్ లో భాగమైన హర్భజన్  పీటీఐతో మాట్లాడుతూ.. ‘టీ20 ఫార్మాట్ లో క్రికెట్ నుంచి రీసెంట్ గా రిటైరైన  క్రికెటర్లను హెడ్ కోచ్ గా నియమించుకోవాలి. రాహుల్ ద్రావిడ్ కంటే  నెహ్రాకు   ఈ ఫార్మాట్  గురించి ఎక్కువ పట్టుంది. 

ద్రావిడ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. మేమిద్దరం కలిసి చాలాకాలం ఆడాం. కానీ ద్రావిడ్  కంటే  నెహ్రాకు ఈ ఫార్మాట్ లో  నాలెడ్జ్ ఎక్కువ. అలా అని నేనేమీ ద్రావిడ్ ను తీసేయాలని చెప్పడం లేదు.  ద్రావిడ్, నెహ్రాలు కలిసి  పనిచేయాలి.   2024  టీ20 ప్రపంచకప్ కోసం ఇద్దరూ సమన్వయం చేసుకుని మెరుగైన జట్టును తయారుచేయాలి.  

ఇద్దరు కోచ్ లు ఉండటం తప్పేమీ కాదు. ఈ విషయంలో అందరూ ఇంగ్లాండ్ ను ఫాలో కావాలి. స్ప్లిట్ కెప్టెన్సీ మాదిరిగా స్ప్లిట్ కోచింగ్ కూడా  ఉంటే బెటర్. దీనివల్ల  ప్రధాన కోచ్  కు విశ్రాంతి కూడా లభిస్తుంది..’ అని తెలిపాడు. 
 

ఇక టీ20 క్రికెట్ లో అటాకింగ్ అప్రోచ్ గురించి భజ్జీ స్పందిస్తూ.. ‘అది మంచి ఆలోచనే. దాని వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. టీ20 ఫార్మాట్ అనేది వన్డే, టెస్టులకు పూర్తి  భిన్నమైనది. సంప్రదాయ  వన్డే క్రికెట్ మాదిరిగా ఆడతామంటే టీ20 లలో కుదరదు. ఇక్కడ తొలి ఆరు ఓవర్లు చాలా కీలకం.   అందుకే  ఓపెనర్లుగా వచ్చే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్,  విరాట్ కోహ్లీలు వాళ్ల స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకోవాలి.  
 

టీ20లలో మొదటి 10 ఓవర్ల లోపు రన్ రేట్ 9కి తక్కువగా ఉండకూడదు. లేకుంటే టీమిండియా చివర్లో సూర్య, హార్ధిక్ పాండ్యాల మీద ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. మొదట వచ్చే ముగ్గురు బ్యాటర్లు దూకుడుగా ఆడితే చివరి ఓవర్లలో వచ్చేవారిమీద ఒత్తిడి తగ్గుతుంది..’ అని అన్నాడు. 

Image credit: PTI

వయసు భారం రీత్యా  రోహిత్, కోహ్లీలు  పొట్టి ఫార్మాట్ లో  కొనసాగాలా..? వద్దా..? అనేదానిపై భజ్జీ మాట్లాడుతూ.. అది తన చేతుల్లో లేదని, వాళ్ల ఫిట్నెస్ సహకరిస్తే  ఆడతారు లేకుంటే  తప్పుకుంటారని  చెప్పాడు. అయితే ఆటగాళ్లను రాత్రికి రాత్రి మార్చడం కుదరదని, ఆడే విధానంలో మార్పులు తీసుకురావాలని భజ్జీ సూచించాడు. 
 

click me!