హాఫ్ సెంచరీ లోకి సచిన్.. వన్డే కెరీర్‌‌లో టాప్ - 5 ఇన్నింగ్స్ ఇవే..

Published : Apr 23, 2023, 02:12 PM IST

Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రేపు (ఏప్రిల్ 24, సోమవారం)  50వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు.  ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ వన్డేలలో ఆడిన  టాప్ -  5 ఇన్నింగ్స్‌ను ఒకసారి చూద్దాం. 

PREV
18
హాఫ్ సెంచరీ లోకి సచిన్.. వన్డే కెరీర్‌‌లో టాప్ - 5 ఇన్నింగ్స్ ఇవే..

భారత్ లో క్రికెట్ ను ఓ మతం కిందే చూస్తారు  అభిమానులు. దేశంలో నిత్యం మతాల గురించి కొట్టుకునేవారంతా క్రికెట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒకటైపోతారు.  ఈ మత ఆరాధకులను  పాతికేండ్ల పాటు తన ఆటతో మంత్రముగ్దుల్ని చేసినవాడు సచిన్ రమేశ్ టెండూల్కర్..  అందుకే  భారత్ లో  క్రికెట్ అనధికారిక మతం అయితే   సచిన్ అధికారిక క్రికెట్ దేవుడు అంటుంటారు  అభిమానులు.  

28

ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజు.   ఐపీఎల్  -16 లో  భాగంగా శనివారం  ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వాంఖెడే మొత్తం సచిన్ నామస్మరణతో ఊగిపోయింది.  ‘సచిన్.. సచిన్’ అంటూ వాంఖెడే  దద్దరిల్లింది.  
 

38

సచిన్  రేపు  50వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. తన 24 ఏండ్ల కెరీర్ లో  సచిన్.. 200 టెస్టులు,  463 వన్డేలు ఆడాడు.  ఈ క్రమంలో  రెండు ఫార్మాట్లలో వంద సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన  ఏకైక బ్యాటర్ గా  చరిత్ర పుటల్లోకెక్కాడు.   రెండు ఫార్మాట్లలో కలిపి  34,347 పరుగులు చేసిన  సచిన్..  వన్డేలలో  లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.  సచిన్ పుట్టినరోజు సందర్భంగా వన్డేలలో  ఈ దిగ్గజ బ్యాటర్ టాప్ - 5 ఇన్నింగ్స్ ఇక్కడ చూద్దాం. 

48

1. డిసర్ట్ స్ట్రోమ్ :   షార్జా వేదికగా  ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్ లో సచిన్ 131 బంతుల్లో 143 పరుగులు చేశాడు. 1998లో ఆసీస్ బౌలర్లు  డామియన్ ఫ్లెమింగ్,  మైఖెల్ కాస్ఫ్రోవిచ్, షేన్ వార్నర్ వంటి దిగ్గజ బౌలర్లను  సమర్థంగా ఎదుర్కున్నాడు.  ఈ మ్యాచ్ కు  మధ్యలో ఇసుక  తుఫాను అంతరాయం కలిగించింది. కానీ అది ముగిశాకే సచిన్ తుఫాను  ఆసీస్ ను కమ్మేసింది. అందుకే దీనిని డిసర్ట్ స్ట్రోమ్ (ఎడారి తుఫాను) అంటుంటారు. 

58

2. తండ్రి చనిపోయిన బాధలో..:  1999 వన్డే వరల్డ్ కప్ లో  సచిన్ కెన్యాపై  చేసిన   140 పరుగులు చాలా  ప్రత్యేకం.  ఈ మ్యాచ్ కు ముందే సచిన్ తండ్రి చనిపోయారు.  తన తండ్రి అంటే  సచిన్ కు   ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. పుట్టెడంత దుఖంలో కూడా సచిన్ కఠిన సవాళ్లను ఛేదిస్తూ  సెంచరీ చేశాడు. 
 

68

3. పాకిస్తాన్ పై శివతాండవం: 2003 వన్డే వరల్డ్ కప్ లో భారత  జట్టు ఫైనల్ చేరడంలో  సచిన్ ది కీలక పాత్ర.  ఈ టోర్నీలో భారత్  - పాక్ మధ్య జరిగిన మ్యాచ్  లో సచిన్ శివతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్ ముందు 274 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.  అవతలి వైపు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయభ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్ లను ధీటుగా ఎదుర్కున్నాడు.   75 బంతుల్లోనే   98 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సచిన్.. షోయభ్ అక్తర్ బౌలింగ్ లో డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా కొట్టిన సిక్సర్ ను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు.  

78

4. డబుల్ వీరుడు  అతడే :  అధికారికంగా క్రికెట్ ఆడింది 18వ శతాబ్ది నుంచే అయినా  ఈ  జెంటిల్మెన్ గేమ్ లో అందరికీ అందని ద్రాక్షగా మిగిలిన  రికార్డును కూడా సచిన్ తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసింది మన మరాఠా యోధుడే.  కెరీర్ చరమాంకంలో  ఉండగా  సచిన్ ఈ ఘనతను అందుకున్నాడు.   2010లో సౌతాఫ్రికాతో గ్వాలియర్ కోట వేదికగా సఫారీ బౌలర్లను  చీల్చి చెండాడాడు.  సచిన్  డబుల్ సెంచరీ చేసేదాకా ఈ రికార్డును అందుకోవడానికి ఆపసోపాలు పడ్డ  క్రికెటర్లు  ఆ తర్వాత మాత్రం సచిన్ చూపిన బాటలో  సాగుతున్నారు.  సచిన్ శిష్యుడు సెహ్వాగ్,  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (3 డబుల్స్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్  లు కూడా అతడిని అనుసరించారు. 
 

88

5. వందో వంద : సచిన్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.  చేసినవి  99 సెంచరీలు. కానీ ఎంత ప్రయత్నించినా మూడంకెల స్కోరు  చేరుకోవడం లేదు. ఇక సచిన్.. 99 సెంచరీల వద్దే ఆగిపోవాల్సిందేనా అని అభిమానులు నిరాశపడ్డ వేళ 2012లో  మాస్టర్ బ్లాస్టర్    ఎట్టకేలకు  సెంచరీల సెంచరీ చేశాడు.  2012లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో   జరిగిన మ్యాచ్ లో   వంద కొట్టాడు.  సచిన్ చేసిన అన్ని సెంచరీలలో ఇదే అత్యంత నెమ్మదైన సెంచరీ. కానీ  దాని విలువ భారత క్రికెట్ అభిమానులకు తెలుసు. 
 

click me!

Recommended Stories