Ashes: చివరి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కు మరో షాక్.. గాయంతో స్టార్ ఆటగాడు దూరం.. తప్పించారంటున్న ఫ్యాన్స్?

First Published Jan 9, 2022, 4:59 PM IST

Jos Buttler:  యాషెస్  కోల్పోయి దారుణ విమర్శల పాలవుతున్న ఇంగ్లాండ్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ గాయపడటంతో అతడు  సిరీస్ లో చివరిటెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అయితే  అతడిని తప్పించారని, గాయమనేది ఒక సాకు మాత్రమే అంటున్నారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్  లో ఇప్పటికే మూడు టెస్టులు ఓడి సిరీస్ కూడా కోల్పోయిన ఇంగ్లాండ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ జాస్ బట్లర్ కు గాయమైంది. 

నాలుగో టెస్టులో కీపింగ్ చేస్తుండగా అతడికి గాయమైంది. దీంతో అతడు 
సిరీస్ లో చివరిదైన హోబర్ట్ టెస్టుకు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ సారథి జో రూట్ చెప్పాడు. 

ఈ మేరకు రూట్ మాట్లాడుతూ.. ‘బట్లర్ చేతి వేలుకు గాయమైంది. దీంతో అతడు ఇంటికి (ఇంగ్లాండ్) వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడు హోబర్ట్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు..’ అని రూట్ తెలిపాడు. 

గాయపడ్డ బట్లర్ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో.. ఐదో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నాడు. గతేడాది ఇండియాతో జరిగిన సిరీస్ లో కూడా బట్లర్ గాయపడటంతో బెయిర్ స్టోనే వికెట్ కీపింగ్ బాధ్యతలను మోశాడు. 

ఇదిలాఉండగా  ఇంగ్లాండ్ అభిమానుల  వెర్షన్ మరో విధంగా ఉంది.  అతడి పేలవ ప్రదర్శన కారణంగానే బట్లర్ ను తప్పిస్తున్నారనేది వారి వాదన. యాషెస్  సిరీస్ లో బ్యాటర్ గానే  గాక వికెట్ కీపర్ గా కూడా బట్లర్ దారుణంగా విఫలమయ్యాడు. 

తొలి టెస్టు నుంచి మొదులకుని వరుసగా నాలుగు టెస్టుల్లో అతడు  కీలకమైన క్యాచ్ డ్రాప్ లు చేస్తూనే ఉన్నాడు. తొలి టెస్టులో ట్రావిస్ హెడ్ క్యాచ్ ను  బట్లర్ జారవిడిచాడు. ఈ మ్యాచులో అతడు సెంచరీ చేశాడు. 

ఇక  రెండో టెస్టులో  లబూషేన్ ఇచ్చిన రెండు క్యాచులను బట్లర్ మిస్ చేశాడు. దీంతో అతడు కూడా ఆ టెస్టులో సెంచరీ సాధించాడు. ఇక మూడు, నాలుగు టెస్టులలో కూడా ఇవే తప్పిదాలు రిపీట్ అయ్యాయి. 

వికెట్ కీపింగ్ విషయం పక్కనబెడితే బ్యాటర్ గా కూడా బట్లర్ ఈ సిరీస్ లో పెద్దగా రాణించింది లేదు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను డ్రా తో గట్టెక్కించేందుకు ఆడిన ఆట (207 బంతుల్లో 27)  తప్ప అతడు దారుణంగా విఫలమయ్యాడు. 

వికెట్ కీపింగ్ విషయం పక్కనబెడితే బ్యాటర్ గా కూడా బట్లర్ ఈ సిరీస్ లో పెద్దగా రాణించింది లేదు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను డ్రా తో గట్టెక్కించేందుకు ఆడిన ఆట  తప్ప అతడు దారుణంగా విఫలమయ్యాడు. 

ఇక సిడ్నీ టెస్టులో ఆఖరిదాకా అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచులో ఇంగ్లాండ్ గొప్పగా పోరాడి.. మ్యాచును డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో ఇన్నింగ్సులో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 9 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. ఆఖర్లో  బ్రాడ్-జేమ్స్ అండర్సన్ లు పట్టుదలగా ఆడి ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు.

click me!