రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన డేవిడ్ వార్నర్... ఆరెంజ్ జెర్సీలో ‘ఐ విల్ బీ బ్యాక్...’ అంటూ...

First Published Aug 11, 2021, 3:39 PM IST

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నా... చాలామంది టీ20 క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి మాత్రం ఆ తర్వాత జరగబోయే ఐపీఎల్‌పైనే ఉంది. సగంలో ఆడిన సీజన్‌లో ఎవరు ఆడతారు? ఎవరు ఆడరనే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది...

ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సమయంలో మిగిలిన మ్యాచుల కోసం తమ ప్లేయర్లను పంపలేమని చెప్పాయి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలు...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌ జరిగే యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కూడా జరగబోతుండడంతో అన్నిదేశాల క్రికెటర్లు, ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి...

ఈ లిస్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. వాస్తవానికి ఐపీఎల్ జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని అనుకుంటాడు డేవిడ్ వార్నర్...

అయితే ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, డేవిడ్ భాయ్‌ని ఘోరంగా అవమానించింది... కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకుండా డగౌట్‌లో కూర్చోబెట్టింది...

మొదటి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రక్షాళన చర్యల్లో భాగంగా డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌కి జట్టులో కూడా చోటు దక్కలేదు..

ఈ అవమానం తర్వాత డేవిడ్ వార్నర్ మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్ తరుపున ఆడేందుకు ఇష్టపడకపోవచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. వార్నర్ కూడా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ‘నేను వచ్చినా ఆడించరు, డగౌట్‌లో కూర్చుని వాళ్లను ఎంకరేజ్ చేయాలి... అదేదో ఇక్కడి నుంచే చేస్తా...’ అంటూ నిరాశగా సమాధానం ఇచ్చాడు.

దీంతో యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్2 సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆడడేమోనని అనుకున్నారు అభిమానులు. అయితే వార్నర్ మాత్రం రీఎంట్రీ ఇస్తానంటూ హింట్ ఇచ్చాడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన డేవిడ్ వార్నర్... ‘ఐ విల్ బీ బ్యాక్’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చాడు...

కొన్నాళ్ల క్రితం ‘మేం 2016లో టైటిల్ గెలిచాం. నేనేం తప్పుచేశాను. నాకు జట్టులోని ప్రతీ ఒక్క ప్లేయర్ అలాగే కావాలి...’ అంటూ ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్. ఏడుస్తున్నట్టుగా దిగులుగా ఉన్నట్టు ఎమోజీలు కూడా జత చేశాడు...

గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌ను, కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో నుంచి తీసేశారు...  డేవిడ్ వార్నర్ లేకుండా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్, 60 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యింది...

దీంతో డేవిడ్ వార్నర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలంటూ ‘నో వార్నర్, నో ఎస్‌ఆర్‌హెచ్’, ‘బ్రింగ్ బ్యాక్ వార్నర్’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేసి, అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్... 

click me!