AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం

Published : Aug 23, 2026, 01:24 PM IST

Australia vs Bangladesh: రెండో టెస్టులో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్టార్క్, కమిన్స్ ధాటికి బంగ్లా కుప్పకూలింది. కంగారు టీం మొదటి టెస్ట్ ఓటమికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.

PREV
14
స్టార్క్ సునామీకి బంగ్లా విలవిల.. ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ సంచలన విజయం

డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా పక్కా ప్రతీకారం తీర్చుకుంది. మెకేలోని గ్రేట్ బారియర్ రీఫ్ అరేనా లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ 51 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ రెండో రోజునే ముగిసిపోవడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1 తేడాతో సమం చేసింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యద్భుత బౌలింగ్‌తో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

24
షోరిఫుల్ ఇస్లామ్ సూపర్ రికార్డు

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 64 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత, ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 165/8తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా, మరో 45 పరుగులు జోడించింది. కేమరాన్ గ్రీన్ 67 పరుగులు చేసి జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు. అయితే, బంగ్లా పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ అద్భుత బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. అతను 48 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి, విదేశీ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బంగ్లాదేశ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగుల ఆధిక్యం లభించింది.

34
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ దారుణ వైఫల్యం

ఇక రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వరుస బంతుల్లో షాద్మాన్ ఇస్లామ్ (1), మోమినుల్ హక్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ పాట్ కమిన్స్, తంజిద్ హసన్ (9)ను అవుట్ చేయడంతో బంగ్లాదేశ్ లంచ్ బ్రేక్ టైమ్ కు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత కూడా బంగ్లా బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్ దాడికి నిలవలేకపోయారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (31), ముష్ఫికర్ రహీమ్ (29 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 38.3 ఓవర్లలో కేవలం 95 పరుగులకే పరిమితమైంది.

44
స్టార్క్ ధాటికి సరెండర్ అయిన బంగ్లా

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాట్ కమిన్స్ 10 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ నాథన్ లయాన్ టీ విరామం తర్వాత వెంటనే చివరి రెండు వికెట్లు తీసి 25 పరుగులకు 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.

Read more Photos on
click me!

Recommended Stories