The Ashes: ఆ విషయంలో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను చూసి స్ఫూర్తి పొందాలి.. మైక్ హస్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 9, 2022, 10:54 AM IST

Australia Vs England: ఇప్పటికే యాషెస్  సిరీస్ కోల్పోయిన  ఇంగ్లాండ్.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిచే అవకాశం లేకున్నా డ్రా కోసమైనా పోరాడుతున్నది.  ఈ నేపథ్యంలో..

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆసీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచులలో ఓడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతన్న  టెస్టులో ఇంగ్లాండ్ డ్రా కోసం పోరాడుతున్నది. 

ఈ సిరీస్ కోల్పోవడంతో పాటు  పేలవమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ జట్టు ఇంటా బయటా తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నది. కెప్టెన్ జో రూట్ తో పాటు  ఇతర సీనియర్లందరినీ జట్టు నుంచి తప్పించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో  ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఇంగ్లాండ్ జట్టుకు పలు సూచనలు చేశాడు. రూట్ సేన టీమిండియాను చూసి స్ఫూర్తి పొందాలని  సూచించాడు. 

గతేడాది ఆసీస్ పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు.. తొలి టెస్టులో దారుణంగా ఓడినా తర్వాత అసాధారణరీతిలో పుంజుకుని ఏకంగా టెస్టు సిరీస్ నే గెలుచుకుంది. 

ఇదే విషయాన్ని హస్సీ గుర్తుచేస్తూ.. ‘టెస్టు క్రికెట్ లో ఉండే మజానే ఇది. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గతేడాది కూడా భారత జట్టు తొలి టెస్టులో  చిత్తుచిత్తుగా ఓడగానే అందరూ ఆ జట్టును హేళన చేశారు. 

కానీ రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా.. రెండు మ్యాచుల్లో గెలిచి ఏకంగా సిరీస్ నెగ్గింది. తొలి టెస్టు ఓడాక   వాళ్లు (టీమిండియా) ఏం కోల్పోయారో  అది తెలుసుకుని ఆడారు. 
 

ఇంగ్లాండ్ కూడా భారత జట్టు నుంచి స్ఫూర్తి పొందాలి..’ అని హస్సీ తెలిపాడు. గతేడాది ఆసీస్ తో జరిగిన సిరీస్ లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లతో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. తర్వాత రెండో టెస్టులో అనూహ్య విజయం సాధించింది. మూడో టెస్టు డ్రా అయినా నాలుగో టెస్టు గెలిచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఇదిలాఉండగా.. సిడ్నీ టెస్టులో  358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతున్నది.  ఐదో రోజు  ఆట మూడో సెషన్  సమయానికి 68 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 

ఓవర్ నైట్ స్కోరు 30 తో ఐదో రోజు ఆట ఆరంభించిన ఆ జట్టు ఓపెనర్ హసీబ్ హమీద్ (9) మరోసారి నిరాశపరిచాడు. కానీ  మరో ఓపెనర్ జాక్ క్రాలే (77)  బాగా ఆడాడు.   జో రూట్ (24) కూడా ఎక్కువసేపు నిలువలేదు. 

ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (50 నాటౌట్), జానీ  బెయిర్ స్టో (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ నిలకడగా ఆడుతూ మ్యాచును డ్రా చేసేందుకు పోరాడుతున్నారు.  ఈ టెస్టు గెలవాలంటే ఇంగ్లాండ్ ఇంకా 213 పరుగులు చేయాలి. 

click me!