కెప్టెన్లను వదలని కరోనా.. మొన్న కేన్ మామ.. నిన్న హిట్ మ్యాన్.. నేడు మరో సారథి..

First Published Jul 3, 2022, 1:27 PM IST

Mitchell Santner: మాయదారి మహమ్మారి కరోనా క్రికెట్ జట్లకు సారథ్యం వహిస్తున్న సారథుల పై పంజా విసురుతున్నది. ఇప్పటికే పలువురు సారథులు కరోనా బారిన పడి పలు మ్యాచులకు దూరమయ్యారు.

ప్రపంచాన్ని మళ్లీ కలవరపెడుతున్న కరోనా మహమ్మారి ఆయా దేశాల క్రికెట్ కెప్టెన్లను కూడా వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడగా తాజాగా జట్టును నడిపించే నాయకులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. 

ఇటీవలే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కివీస్ సారథి కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు ముందు కరోనా బారిన పడ్డాడు. అతడి స్థానంలో టామ్ లాథమ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక తొలి విదేశీ పర్యటనకు వచ్చాడు. అతడు కూడా ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కోవిడ్ పాజిటివ్ అని తేలాడు. దీంతో అతడు ప్రస్తుతం ఐసోలేషన్ లో  గడుపుతున్నాడు. 

రోహిత్ కు కరోనా అని తేలడంతో.. ఐదు రోజులైనా అది తగ్గకపోవడంతో ఎడ్జబాస్టన్  టెస్టులో భారత జట్టు జస్ప్రీత్ బుమ్రా  నాయకత్వంలో బరిలోకి దిగింది. 

ఇక కేన్ మామ గైర్హాజరీలో న్యూజిలాండ్  పరిమిత ఓవర్ల జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మిచెల్ సాంట్నర్ కూడా  ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లేది అనుమానమే. 
 

ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన  తర్వాత ఐర్లాండ్ కు వెళ్లాల్సి ఉన్న  న్యూజిలాండ్ జట్టు... జులై 10 నుంచి ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.  ఈ సిరీస్ కు కేన్ మామ అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సాంట్నర్ ను సారథిగా నియమించింది. 

అయితే ఆదివారం ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్ బయల్దేరిన కివీస్ జట్టులో సాంట్నర్ లేడు. అతడికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతడు డబ్లిన్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కు ఐర్లాండ్ సిరీస్ లో హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న షేన్ జర్గెన్సన్ వెల్లడించాడు. 
 

ఐర్లాండ్ లో కివీస్.. జులై 10, 12, 15 లలో మూడు  వన్డేలు ఆడుతుంది. ఈ నెల 18, 20, 22న టీ20లు ఆడాల్సి ఉంది. వన్డేలు డబ్లిన్ లో జరుగనుండగా.. టీ20లు బెల్ ఫాస్ట్ వేదికగా జరుగుతాయి. 

click me!