అంబటి రాయుడి తర్వాత అయ్యర్ అలా! సూర్య ఇలా... టీమిండియాకి తీరని టూ డౌన్ సమస్య!

First Published Mar 19, 2023, 5:03 PM IST

టీమిండియాలో ఓపెనర్ పొజిషన్ కోసం బీభత్సమైన పోటీ ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్... ఇలా ఒకరు కాకపోతే ఒకరు ఓపెనింగ్ చేసేందుకు రెఢీగా ఉన్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా టీమిండియాకి తీరని సమస్యగా మారింది టూ డౌన్ పొజిషన్...

రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సరైన ప్లేయర్ కోసం ఎన్నో ఏళ్ల పాటు ఎదురుచూసింది టీమిండియా. కొన్నాళ్లు సురేష్ రైనా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసినా నెం.5, నెం.6 పొజిషన్లలోనే ఎక్కువ మ్యాచులు ఆడాడు.. నిలకడైన ప్రదర్శన ఇవ్వలేక టీమ్‌లో చోటు కోల్పోయాడు...

2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు నాలుగో స్థానంలో నిలకడైన ప్రదర్శన చూపించి, ఆ పొజిషన్‌కి సరైన ప్లేయర్‌గా మారాడు అంబటి రాయుడు. అయితే అతనికి వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధావన్ గాయపడిన తర్వాతైనా తనకి పిలుపు వస్తుందని ఆశించిన అంబటి రాయుడు, అప్పుడు కూడా సెలక్టర్లు అతన్ని పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది, రిటైర్మెంట్ ఇచ్చేశాడు...

Shreyas Iyer

అంబటి రాయుడి తర్వాత మనీశ్ పాండే వంటి ప్లేయర్లను నాలుగో స్థానంలో ప్రయోగించింది టీమిండియా. అయితే ఎవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.  అయితే వన్డేలకు ఎలాంటి బ్యాటింగ్ కావాలో అలాంటి టాలెంట్‌ని టన్నుల్లో పుచ్చుకుని పుట్టిన శ్రేయాస్ అయ్యర్.. టీమిండియాకి సరైన టూ డౌన్ ప్లేయర్‌గా కనిపించాడు..

Image credit: PTI

నిలకడైన ప్రదర్శన ఇస్తూ, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌లా కనిపించాడు. అయితే ఓ గాయం అతని కెరీర్ గ్రాఫ్‌ని మొత్తం మార్చేసింది. 2021 మార్చిలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, అప్పటి నుంచి పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా గాయపడి టీమ్‌కి దూరం కావడంలో నిలకడ చూపిస్తున్నాడు...
 

ఈ రెండేళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఆడిన మ్యాచుల సంఖ్య కంటే గాయం కారణంగా తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. టీ20ల్లో టూ డౌన్ ప్లేయర్‌గా అదిరిపోయే రికార్డు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్‌ని, శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఆడిస్తూ వస్తోంది టీమిండియా... అయితే వన్డేల్లో మాత్రం అతను అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు...

Surya

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. అంతేకాదు టెస్టు సిరీస్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అయ్యర్ గాయం కారణంగా తప్పుకోవడంతో సూర్య మూడు మ్యాచుల్లోనూ ఫెయిల్ అవ్వడం.. టీమిండియాని తెగ ఇబ్బంది పెట్టింది..

సూర్య స్టైల్ వన్డేలకు సెట్ కాదని తేలిపోయింది. శ్రేయాస్ అయ్యర్ వరుసగా గాయపడుతూ టీమ్‌కి అందుబాటులో ఉండలేకపోతున్నాడు. అయినా వన్డేల్లో రాణిస్తున్న సంజూ శాంసన్‌ని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. అలాగే రాహుల్ త్రిపాఠి వంటి సత్తా ఉన్న ప్లేయర్లను వాడుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు...

Sanju Samson-Shreyas Iyer

ఓపెనర్ల విషయంలో రకరకాల ప్రయోగాలు చేసిన రోహిత్ శర్మ - రాహుల్ ద్రావిడ్... నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేకుంటే సూర్యకుమార్ యాదవ్‌లను మాత్రమే ఆడించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే కొత్త ప్లేయర్లను ఆడించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.. 

click me!