
భారతదేశ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి ఒక కొత్త బ్రాండ్ అడుగుపెట్టింది. బీవైడీ సబ్ బ్రాండ్, ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ డెంజా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు జెడ్9 జీటీని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.56 కోట్లుగా ఉంది.
ఈ కారును కొనాలనుకునే వారు రూ.10 లక్షలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ దీనితో పాటు తన డీ9 ఎంపీవీ మోడల్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ సెడాన్ లేదా ఎస్‌యూవీ కారు కాదు. ఇదొక ప్రత్యేకమైన ఫోర్ డోర్ షూటింగ్ బ్రేక్ కారు. దీని పైకప్పు వెనుక వైపుకు వాలుగా ఉండి, క్యాబిన్ చాలా పొడవుగా ఉంటుంది. రోడ్డుపై వెళ్తుంటే ఇది మిగతా అన్ని కార్ల కంటే చాలా భిన్నంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
భారత్‌లో ఈ కారుకు సంబంధించి కేవలం ఎలక్ట్రిక్ మోడల్‌ను మాత్రమే విక్రయించనున్నారు. ఇందులో 122.5 kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అమర్చారు. కారుకు పవర్ ఇవ్వడానికి మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ మూడు మోటార్లు కలిసి 1,139 hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వేగం విషయంలో ఇది ఏ స్పోర్ట్స్ కారుకూ తక్కువ కాదు. కేవలం 2.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
దీని టాప్ స్పీడ్ గంటకు 270 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 670 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 1,500 kW ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 9 నిమిషాల్లోనే 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ దెబ్బతినకుండా ఉండేందుకు 97 శాతం వద్ద ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
సైజు పరంగా చూస్తే ఇది చాలా పెద్దది, వెడల్పుగా ఉండే కారు. దీని పొడవు 5,180 mm కాగా, వెడల్పు 1,990 mm గా ఉంది. వీల్‌బేస్ ఎక్కువగా ఉండటం వల్ల లోపల కూర్చునే వారికి కాళ్లకు మంచి స్థలం దొరుకుతుంది. కారు ముందు భాగంలో షార్ప్ ఎల్‌ఈడీ లైట్లు, పైకప్పుపై ప్రత్యేక సెన్సార్ ఉన్నాయి.
సైడ్ భాగంలో 20-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ బయటకు కనిపించకుండా బాడీ లోపలే దాగి ఉంటాయి. ఇంత పెద్ద కారును ఇరుకైన సందుల్లో తిప్పడం కష్టం. అందుకే కంపెనీ ఇందులో రియర్ వీల్ స్టీరింగ్ టెక్నాలజీని ఇచ్చింది. దీని వెనుక చక్రాలు 15 డిగ్రీల వరకు తిరుగుతాయి. ఈ స్పెషల్ ఫీచర్ వల్ల కారు ఉన్నచోటే గుండ్రంగా తిరగగలదు, అంతేకాకుండా పీతలా పక్కకు కూడా నడుస్తుంది.
ఈ కారు లోపల ఐదుగురు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ముందు ఉండే రెండు సీట్లను ఒక బటన్ నొక్కడం ద్వారా నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సీట్లలో చల్లని, వెచ్చని గాలితో పాటు మసాజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. వెనుక సీట్లలో కూర్చునే వారికి కూడా హీటింగ్, మసాజ్ ఫీచర్లను అందించారు. లోపలి భాగం మొత్తం ప్రీమియం లెదర్‌తో ఉంటుంది.
కారు డోర్లను సున్నితంగా తాకితే అవే ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. డ్యాష్‌బోర్డ్‌పై మూడు పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. మధ్యలో 17.3-అంగుళాల మెయిన్ స్క్రీన్, డ్రైవర్ ముందు 13.2-అంగుళాల డిస్‌ప్లే, పక్కన కూర్చునే ప్రయాణికుడి కోసం అంతే సైజులో మరో ప్రత్యేక స్క్రీన్ ఇచ్చారు. మ్యూజిక్ కోసం ఇందులో 20 స్పీకర్లు అమర్చారు.
ఇంత వేగంగా దూసుకెళ్లే కారులో భద్రతకు కూడా కంపెనీ పూర్తి ప్రాధాన్యం ఇచ్చింది. కారు ముందు భాగంలో ఆరు, వెనుక భాగంలో ఆరు రాడార్లను అమర్చారు. ఈ 12 రాడార్లు కారు చుట్టూ జరిగే ప్రతి కదలికపై నిఘా ఉంచుతాయి. వీటితో పాటు 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా సదుపాయం కూడా ఉంది.
టైర్లలో గాలి ఒత్తిడిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి ప్రత్యేక సెన్సార్లు ఉన్నాయి. కారు పార్క్ చేయడంలో ఇబ్బంది పడేవారి కోసం ఇందులో ఆటో పార్క్ ఫీచర్ ఇచ్చారు. డ్రైవర్ సహాయం లేకుండానే కారు తనంతట తాను సురక్షితమైన స్థలాన్ని చూసుకుని పార్క్ అవుతుంది.
రూ.1.56 కోట్ల ధరతో వచ్చిన ఈ కారును ప్రత్యేకమైన కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. భారత్‌లో ఈ బడ్జెట్‌లో అత్యంత వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ కార్ల ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకే కారులో సూపర్ కారు లాంటి వేగం, లగ్జరీ కారు లాంటి సౌకర్యం కోరుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. డెంజా దీనితో పాటు మార్కెట్‌లోకి తెచ్చిన డీ9 ఎంపీవీ కారు నేరుగా టయోటా వెల్‌ఫైర్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త బ్రాండ్ రాకతో భారత లగ్జరీ కార్ల మార్కెట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.