Budget Car: భారతీయ కార్ల మార్కెట్‌లో ఎన్నో కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ, కొన్ని కార్లు మాత్రం ఏళ్ల తరబడి వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి. అలాంటి మోడళ్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఒకటి. ఇప్పటికీ కారుకు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాలు మరోసారి ఆకట్టుకున్నాయి. 2026 జూన్ నెలలో ఈ కారు 16,952 యూనిట్లు అమ్ముడై మార్కెట్లో మంచి ఆదరణను కొనసాగించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సుమారు 31 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతం ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వ్యాగన్ ఆర్ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఈ అమ్మకాలతో ఆ నెలలో అత్యధికంగా విక్రయమైన కార్ల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
24
ఎందుకు ఆదరణ కొనసాగుతోంది.?
1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన వ్యాగన్ ఆర్ కాలానుగుణంగా అనేక మార్పులతో ముందుకు సాగుతోంది. ప్రతి కొత్త వెర్షన్‌లో డిజైన్, భద్రత, ఫీచర్లు, పనితీరులో మార్పులు తీసుకువస్తూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన పరిమాణం, లోపల విశాలమైన స్థలం, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, ఎక్కువ మైలేజ్ కారణంగా ఈ కారు కుటుంబాలతో పాటు ఉద్యోగ వర్గంలో కూడా మంచి ఆదరణ పొందుతోంది.
34
ధర, ఇంజిన్ ఎంపికలు ఎలా ఉన్నాయి?
వ్యాగన్ ఆర్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.6.95 లక్షల వరకు ఉంటుంది. LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 67 PS పవర్, 89 Nm టార్క్‌ను అందిస్తే, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఎంపిక చేసిన వేరియంట్లలో AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
మైలేజ్ విషయంలో కూడా వ్యాగన్ ఆర్ మంచి పేరు సంపాదించింది. 1 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.35 కిలోమీటర్లు, AMT వేరియంట్ 25.19 కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.56 కిలోమీటర్లు, AMT వేరియంట్ 24.43 కిలోమీటర్లు వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక CNG వేరియంట్ ఒక కిలో గ్యాస్‌తో 33.47 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. అందుబాటు ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక మైలేజ్, విశ్వసనీయత వంటి అంశాల వల్ల బడ్జెట్‌లో మంచి కారును కొనాలనుకునే వారికి వ్యాగన్ ఆర్ ఇప్పటికీ బలమైన ఎంపికగా నిలుస్తోంది.