ఎల్ డొరాడో నిధి
ఈ నిధి కోసం వెతికి చాలా మంది చనిపోయారు. ఈ నిధి కొలంబియాలోని గ్వాటవిటా సరస్సులో ఉందని చెబుతారు. సరస్సు అడుగు భాగంలో బంగారం ఉందని నమ్ముతారు. వందల సంవత్సరాల క్రితం, చిప్చా తెగ ప్రజలు సూర్యుడిని పూజించేటప్పుడు సరస్సులో చాలా బంగారాన్ని విసిరారని ఒక మత విశ్వాసం కూడా ప్రచారంలో ఉంది. చాలా సంవత్సరాలుగా ఇలా చేయడం వల్ల సరస్సు అడుగు భాగంలో ఎక్కువ మొత్తంలో బంగారం పేరుకుపోయింది. స్పానిష్ పైరేట్ అయిన ఫ్రాన్సిస్కో పిజారో ఈ నిధిని దోచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడట. కాని అది విఫలమైంది. ఇప్పటికీ ఈ సరస్సులో బంగారం కోసం స్థానికులు వెతుకుతుంటారు.
అంబర్ రూమ్ నిధి
అంబర్ రూమ్ అంటే.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్. అందులో 1707లో వెలకట్టలేని బంగారు నిధిని దాచారు. ఇది రష్యా, పెర్షియా మధ్య శాంతికి బహుమతిగా పీటర్ I అనే రాజుకి దక్కింది. 1941 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నిధిని వారు పూర్తిగా దక్కించుకోలేకపోయారట. 1943లో ఒక మ్యూజియంలో దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుండి అంబర్ రూమ్ వద్ద ఇంకా నిధులు దొరుకుతాయని స్థానికులు తవ్వకాలు చేస్తుంటారు. అయితే ఈ నిధికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు.
చంగిజ్ ఖాన్ నిధి
మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన చంగిజ్ ఖాన్ తన పాలనలో ప్రపంచాన్ని జయించాడు. అనేక రాజ్యాలను ఆక్రమించాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధ యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో చంగిజ్ ఖాన్ దాదాపు మొత్తం ప్రపంచాన్ని జయించి చాలా సంపదను కూడబెట్టాడు. 1227లో చంగిజ్ ఖాన్ మరణించాడు. అతని శరీరం, సంపాదించిన నిధులను రహస్య ప్రదేశంలో ఖననం చేశారని చెబుతారు. ఆ కథలు, ఆధారాల ప్రకారం నిధి కోసం వెళ్ళిన వారు తిరిగి రాలేదని చెబుతారు. ఇప్పటికీ మంగోల్ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుంటాయట.
ఫారెస్ట్ ఫెన్ నిధి
ఫారెస్ట్ ఫెన్ అనే వ్యక్తి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ (USAF)లో పనిచేశాడు. అతను పైలట్‌గా ఉండేవాడు. ఫారెస్ట్ ఫెన్ బిలియన్ డాలర్ల విలువైన కళాఖండాల వ్యాపారం కూడా చేసేవాడు. 1980లో అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు అతను తన బిలియన్ డాలర్ల విలువైన నిధిని ఎక్కడో దాచిపెట్టాడు. తన నిధిని కనుగొనడానికి ప్రజలకు కొన్ని ఆధారాలు ఇచ్చాడు. వాటి ఆధారంగా నిధి కోసం ప్రయత్నించిన వారు చాలా మంది చనిపోయారు.
జీన్ లాఫిట్ నిధి
ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లాఫిట్, అతని సోదరుడు పియర్ సముద్రపు దొంగలు. వారు మెక్సికో గల్ఫ్‌లోని వాణిజ్య నౌకలపై దాడి చేసేవారు. లాఫిట్ 1830లో మరణించాడు. అతని మరణం తరువాత వారు దోచుకున్న నిధి న్యూ ఓర్లీన్స్ తీరం చుట్టూ ఎక్కడో దాచారని చెబుతారు. దీని కోసం ఇప్పటికీ సీక్రెట్ గా వేట సాగుతూ ఉంటుంది.
ఓక్ ఐలాండ్ నిధి
ఓక్ ద్వీపంలో బిలియన్ల విలువైన దాచిన నిధి ఉందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. 1975లో ఓక్ ద్వీపంలోని నోవా స్కోటియా ప్రాంతం సమీపంలో కొంతమంది పిల్లలు లైట్లను చూశారు. ఆ తరువాత, పిల్లలు అక్కడ తవ్వినప్పుడు 40 అడుగుల లోతులో 2 మిలియన్ పౌండ్లు విలువైన సంపదను గుర్తించారు. దీని తరువాత చాలా మంది నిధి కోసం వెతికారు. అమెరికా అధ్యక్షుడు కాక ముందు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ కూడా ఈ నిధి కోసం వెతికారట.