ప్రస్తుత రోజుల్లో అసలు కరెన్సీ నోట్లు, కాయిన్స్ తో పనే ఉండటం లేదు. ఎక్కడికి వెళ్లినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేయొచ్చు. మీరు కనీసం కప్పు టీ కొన్నా ఫోన్ పే, గూగుల్ పే చేసేయొచ్చు. ఆన్ లైన్ పేమెంట్ చేస్తే కరెన్సీ నోట్లు, కాయిన్స్ అవసరం ఉండదు. చిల్లర సమస్య తలెత్తదు. పేమెంట్ కూడా సింపుల్ గా అయిపోతుంది. డిజిటల్ లావాదేవీల వల్ల ట్రాన్సరెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. టాక్స్ ఎగ్గొట్టడానికి అవకాశం ఉండదు. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఆన్ లైన్ లావాదేవీల వల్ల సైబర్ దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి అవగాహన పెంచుకొని జాగ్రత్తలు పాటిస్తే డిజిటల్ చెల్లింపులు చాలా సింపుల్ గా, సౌకర్యంగా ఉంటాయి.
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నేరుగా డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఇలా డబ్బు అవసరమైనప్పుడు ఆ టైమ్ లో వెంటనే ఏటీఎం ఎక్కడ ఉందో వెతుకుతాం. లేదా దగ్గర్లో బ్యాంకు ఉంటే నేరుగా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇకపై అలా కంగారు పడాల్సిన అవసరం లేకుండా తపాలా శాఖ ఆధార్ ఏటీఎం(AePS) అనే కొత్త సేవను ప్రారంభించింది. దీని ద్వారా మీరు మీ ఇంటి నుండే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇస్తున్న ఈ ప్రత్యేక సేవ గురించి ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మీకు అత్యవసరంగా నగదు అవసరమైతే బ్యాంక్ లేదా ATMకి వెళ్లడానికి సమయం లేకపోతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్‌లైన్ ఆధార్ ATM ( AePS ) సేవను ఉపయోగించుకోండి.
ఈ సేవను ఉపయోగించుకుంటే మీ ఊరి పోస్ట్‌మాన్ మీ ఇంటికే వచ్చి నగదును విత్‌డ్రా చేసి ఇస్తారు. నగదు కావాలని మీరు మీ ఫోస్టాఫీస్ కు సమాచారం ఇచ్చినా, లేదా అక్కడకు వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ ఆన్‌లైన్ ఆధార్ ATM ( AePS ) సేవను వినియోగించుకోవాలంటే మీ ఆధార్ మీ బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా మీ బయోమెట్రిక్ కూడా సక్రమంగా నమోదై ఉండాలి. ఈ సమాచారం ఉపయోగించి మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
AePS ద్వారా ఇంటి నుండే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అకౌంట్ లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. ఇంకా ఇతర బ్యాంకులకు డబ్బును బదిలీ కూడా చేయవచ్చు.
ఈ సేవలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కానీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసినందుకు గాను పోస్ట్ మెన్ కి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఏటీఎం వాడటానికి, ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా, బయోమెట్రిక్ తప్పనిసరి.
ఆన్‌లైన్ ఆధార్ ATM ( AePS ) సేవను వినియోగించుకోవాలంటే ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్లడం తప్పనిసరి కాదు. అయితే లావాదేవీని విజయవంతంగా ప్రాసెస్ చేయడానికి ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసి ఉంచడం తప్పనిసరి.
మీరు డబ్బును విత్ డ్రా చేసిన తర్వాత రిజిస్టర్ చేసిన మీ మొబైల్ నంబర్ కు నగదు ట్రాన్సాక్షన్ గురించి వివరంగా SMS వస్తుంది. ఈ మెసేజ్ ను ఇండియన్ పోస్టల్ సర్వీస్ తో పాటు మీ అకౌంట్ ఉన్న బ్యాంకు కూడా వివరంగా మెసేజ్ పంపుతుంది.
AEPS ఏటీఎం సేవలు వినియోగించుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ఎటువంటి ఛార్జ్ విధించరు. కేవలం మీరు విత్ డ్రా చేసిన అమౌంట్ మాత్రమే మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. దీనిపై అదనపు ఛార్జీలు ఎలాంటివి ఉండవు. ఇటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ కాని, మీ బ్యాంకు గాని ఎలాంటి ఛార్జ్ తీసుకోదు. అయితే మీ ఇంటికి వచ్చి డబ్బు విత్ డ్రా చేయడానికి సర్వీస్ చేసినందుకు గాను పోస్ట్ మెన్ కి సర్వీస్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అత్యవసర సమయంలో ఇంటికి ఏటీఎం ను తెప్పించుకొని డబ్బులు విత్ డ్రా చేసుకోండి.