Gold Rate: బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కానీ తులం బంగారం 15 లక్షల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉందంట. ఇప్పుడున్న ధరతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు పెరిగే ఛాన్స్.. ఎప్పుడు ఆ రేటుకు చేరుతుందో తెలుసా?
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న రోజులు ఇవి. తులం వస్తువులు కొనాలంటే రెండు లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనేవాళ్లు ఒకవైపు ఉంటే.. భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందని పెట్టుబడిగా కొనేవాళ్లు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారికి షాకయ్యే విషయం బయటికి వచ్చింది. బంగారం భవిష్యత్తు ధరపై ఓ బిలియనీర్ భారీ అంచనా వేశారు. ఎలెక్ట్రమ్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ బంగారం పెట్టుబడిదారు థామస్ కాప్లాన్ ప్రకారం.. భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా పది రెట్లు పెరగొచ్చు. అంటే భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.15 లక్షలకు చేరే అవకాశం ఉందన ఆయన వేసిన లెక్కలు చెబుతున్నాయి. అంటే ఈరోజు ఒక తులం బంగారం కొనడానికి అయ్యే డబ్బుతో భవిష్యత్తులో చాలా తక్కువ బంగారమే వచ్చే పరిస్థితి రావచ్చన్నమాట.
23
బంగారం ధర పడిపోతోంది కదా
ఇటీవల బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించడంతో చాలామందిలో ఇదే సందేహం మొదలైంది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇక తగ్గుతాయా? అనే చర్చ మొదలైంది. కానీ థామస్ కాప్లాన్ మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధర తగ్గుదలను పట్టించుకోవద్దని అంటున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. బంగారం మరో పది రెట్లు పెరగడం తప్పదట. అయితే సమీప కాలంలో బంగారం ధర ఏ దిశలో వెళ్తుందో మాత్రం తనకు ఖచ్చితంగా తెలియదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే రేపు లేదా వచ్చే నెలలో ధర తప్పకుండా పెరుగుతుందని ఆయన చెప్పడం లేదు. ఆయన అంచనా ప్రధానంగా మధ్య, దీర్ఘకాలిక పరిస్థితులపై ఆధారపడి ఉంది.
33
రూ.15 లక్షల బంగారం నిజంగానే సాధ్యమా?
బంగారం 10 గ్రాములకు రూ.15 లక్షలు అవుతుందనే మాట వినగానే ఎంతోమందకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే బంగారం ధరను ఒక్క అంశం మాత్రమే నిర్ణయించదు. అంతర్జాతీయ బంగారం ధర, డాలర్‌తో రూపాయి విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ఒక వ్యక్తి చేసిన అంచనాను భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే ధరగా చూడటం సరైంది కాదు. ప్రస్తుతం కాప్లాన్ చెప్పింది ఏమిటంటే.. బంగారంపై దీర్ఘకాలికంగా తనకు చాలా బలమైన నమ్మకం ఉందని మాత్రమే. ఒకవేళ ఆయన చెప్పిన అంచనా నిజమైతే మాత్రం, భారత మార్కెట్లో బంగారం ధర ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈరోజు బంగారం కొంటున్న వారి దగ్గర ఉన్న పసిడి విలువ భారీగా పెరగొచ్చు. అయితే ధరలు పెరుగుతాయని ఆశించి ఎవరైనా తమ మొత్తం డబ్బును బంగారంలో పెట్టుబడి పెట్టడం మాత్రం సరైన నిర్ణయం కాదు. బంగారానికి రూ.15 లక్షల ధర ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? అనేది మాత్రం భవిష్యత్తే నిర్ణయించాలి.