Home Loan:ఇల్లు కొనాలనుకునే వాళ్ళందరూ హోమ్ లోన్ అప్లై చేస్తారు. అయితే వారికి ఎంత జీతం ఉంటే ఎంత హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఎంత ఈఎమ్ఐ కట్టాలి వంటి వాటిని అవగాహన ఉండదు. అలాంటి వారి కోసమే ఈ కథనం.
సొంతిల్లు కొనుక్కోవడం అన్నది ప్రతి ఒక్కరి కల. ఇప్పుడు అపార్ట్మెంట్ల కాలం నడుస్తోంది. ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కొంటే.. కొంత డబ్బును డౌన్ పేమెంట్ కింద బిల్డర్ కు ఇచ్చి మిగతా మొత్తాన్ని హోమ్ లోన్ పెట్టుకుంటారు. అయితే చాలామందికి తమ జీతానికి ఎంత హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉందో.. నెలకి ఎంత ఈఎమ్ఐ కట్టాలో కూడా అవగాహన ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన తర్వాత మన దేశంలో హోమ్ లోన్ వడ్డీరేట్లు చాలా వరకు తగ్గాయి. గత ఏడాది రెపో రేటు 1.25 శాతం తగ్గింది. దీనివల్ల కార్ లోన్లు, గృహ రుణాలు కూడా చవకగా మారాయి. దీనివల్ల ప్రతినెలా కట్టాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఇక దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. ఎక్కువ మంది ఎస్బిఐ నుంచి హోమ్ లోన్ తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎస్బిఐ తమ కస్టమర్లకు కేవలం 7.25 నుండే గృహ రుణాలను అందిస్తోంది. 7.25 శాతం వడ్డీతో 30 ఏళ్ల కాలానికి 50 లక్షల రూపాయల గృహ రుణం కావాలంటే మీ జీతం ఎంత ఉండాలో తెలుసుకోండి.
23
ఎంత జీతం ఉండాలి?
హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి ఆ అప్పు తీరుస్తారో మీరే ఎంపిక చేసుకోవచ్చు. కొంతమంది పదేళ్లు, మరి కొంతమంది 15 ఏళ్ళు, మరి కొంత మంది 30 ఏళ్లు కూడా ఎంపిక చేసుకుంటారు. 7.25 శాతం వడ్డీ రేటుతో 30 ఏళ్ల పాటు 50 లక్షలు గృహ రుణం పొందడానికి మీ నెల జీతం 69 వేల రూపాయలు ఉండాలి. మీ జీతం 69 వేల రూపాయలు ఉంటే కచ్చితంగా మీకు 50 లక్షల లోను వస్తుంది. అయితే వేరే బ్యాంకు లోన్ ఏదీ మీ జీతంపై ఉండకూడదు. 50 లక్షల గృహణం తీసుకున్నాక ప్రతినెలా ఈఎమ్ఐల రూపంలో రూ.34,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ జీతంలో దాదాపు సగం ఈఎంఐ రూపంలోనే కట్టాల్సి ఉంటుంది.
33
క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి?
ఏ బ్యాంకు నుంచి అయినా గృహ రుణం పొందాలంటే మీకు మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావు. ఏ రకమైన రుణానికి అయినా క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యం. 750 లేదా అంతకన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు ఖచ్చితంగా లోన్ వస్తుంది. బ్యాంకులు మీ పాత లోన్లు, అవి మీరు కట్టిన తీరును కూడా సమీక్షిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీతో మీకు లోన్ త్వరగా వస్తుంది. గృహ రుణమే కాదు ఏ రుణమైన కూడా క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటేనే వచ్చే అవకాశాలు అధికం. కాబట్టి హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించండి.