అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్తలు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ Google సంస్థను స్థాపించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు గూగుల్‌ను సెప్టెంబర్ 4, 1998 న ప్రారంభించారు. 2015లో ఆల్ఫాబెట్ ఇంక్ అనుబంధ సంస్థగా Google మార్పు చెందింది. ఆల్ఫాబెట్ CEO అయిన లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచాయ్ అక్టోబర్ 24, 2015న Google CEOగా నియమితులయ్యారు. డిసెంబర్ 3, 2019న పిచాయ్ ఆల్ఫాబెట్ సీఈఓ కూడా అయ్యారు.
Google ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. ఇది మ్యాపింగ్, నావిగేషన్ అప్లికేషన్ లో టాప్ సర్వీసులను అందిస్తోంది. ఇమెయిల్ ప్రొవైడర్, ఆఫీస్ సూట్, ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్, ఫోటో, క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడర్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ బ్రౌజర్, AI వర్చువల్ అసిస్టెంట్ ప్రొవైడర్ ఇలా వినియోగదారులకు అవసరమైన అనేక సర్వీసులను అందిస్తోంది. ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక, మార్కెట్ లెక్కల ప్రకారం అత్యంత విలువైన బ్రాండ్‌ల జాబితాలో Google రెండవ స్థానంలో ఉంది.