UPI Service
UPI Service : ఆధునిక టెక్నాలజీ పుణ్యాన బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్) రాకతో ఇప్పుడు అన్ని ఆర్థిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. కేవలం బ్యాంకింగ్ సేవలే కాదు కరెంట్, వాటర్ బిల్లు వంటివి కూడా ఇంట్లో కూర్చునే చెల్లిస్తున్నారు. ఇలా యూపిఐ ఆధారంగా పనిచేసే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ ను ఇప్పుడు ప్రతిఒక్కరు వాడుతున్నారు. రూపాయి నుండి లక్షల రూపాయల వరకు ఎలాంటి పేమెంట్స్ అయినా ఈ యాప్స్ నుండే ఈజీగా జరిగిపోతున్నాయి.
అయితే మరో మూడ్రోజుల్లో ఆర్థిక సంవత్సరం మారనుండటంతో యూపిఐ రూల్స్ లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి కొన్ని ఫోన్ల నెంబర్లకు ఈ యూపిఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఇలా ఎందుకు నిలిపివేస్తున్నారు? ఇందులో మీ ఫోన్ నెంబర్ కూడా ఉందా? తిరిగి యూపిఐ సేవలు పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం.
UPI Service
ఆ ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు బంద్ :
ప్రస్తుతం చాలా ఆర్థిక లావాదేవీలు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. భారీగా ఆర్థిక లావాదేవీలుంటూనే బ్యాంకుకు వెళ్లడం లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. మిగతా లావాదేవీల కోసం యూపిఐ ఆధారితంగా పనిచేసే ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. కూరగాయల బండి నుండి లగ్జరీ హోటల్స్ వరకు ప్రతిచోట ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ఉపయోగించే సౌకర్యం ఉంది. కాబట్టి చాలామంది డబ్బులను వెంటపెట్టుకెళ్లడం మరిచిపోయారు... పేమెంట్స్ యాప్ నే ఉపయోగిస్తున్నారు.
ఇలా ఆన్ లైన్ లోనే ఆర్థిక లావాదేవీలు పెరిగిపోవడం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన అకౌంట్లోని డబ్బులు కొట్టేసే ముఠాలు పెరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
చాలాకాలంగా ఉపయోగించని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు నిలివేయాలంటూ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుండి యాక్టివ్ లో లేని లేదా ఎక్కువకాలం వాడకుండా ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్ సేవలను నిలిపివేయనున్నాయి బ్యాంకులు. ఆర్థిక మోసాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ఎన్పిసిఐ.
చాలాకాలంగా ఉపయోగించకుండా ఉండే ఫోన్ నంబర్లను ఇన్ యాక్టివ్ చేస్తాయి సర్వీస్ ప్రొవైడర్స్. తర్వాత ఇదే ఫోన్ నంబర్ ను మరో కస్టమర్ కు కేటాయిస్తాయి. దీంతో గతంలో ఈ నెంబర్ ద్వారా ఉపయోగించిన యూపిఐ సేవలు వారి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్ లావాదేవీల వివరాలు, ఓటిపిలు కూడా వేరేవారి చేతిలోకి వెళతాయి. దీంతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు.
Phome Pe, Google Pay
యూపిఐ సేవలు బంద్ అయ్యే నెంబర్ల జాబితాలో మీ నంబర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవడం?
మీరు కూడా చాలాకాలంగా ఏవయినా ఫోన్ నంబర్లు ఉపయోగించడంలేదా? కానీ ఆ నంబర్ తోనే యూపిఐ యాక్టివేట్ లో ఉందా? అయితే ఈ నంబర్ కు ఏప్రిల్ 1 నుండి యూపిఐ సేవలు నిలిచిపోతాయి. ఇప్పటికే మీ నంబర్ కు యూపిఐ సేవలు నిలిపివేయనున్నట్లు మెసేజ్ వచ్చివుంటుంది. దీంతో మీరు అప్రమత్తం కావాల్సి ఉంటుంది.
యూపిఐ సేవలు నిలిచిపోకుండా వుండాలంటే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మెసేజ్ వచ్చాక కూడా ఎలాంటి స్పందన లేకపోతే ఆ నంబర్ కు యూపిఐ సేవలు నిలిపివేస్తారు. దీంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు.
బ్యాంకు నుండి మీకు ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలకు సంబంధించిన మెసేజ్ లు వస్తున్నాయంటే మీ ఫోన్ నంబర్ యాక్టివ్ లో ఉన్నట్లే. ఇలాంటి నంబర్లు కలిగినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి నంబర్లకు కూడా యూపిఐ సేవలు నిలిచిపోతే వెంటనే బ్యాంకును సంప్రదించండి లేదంటే బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం చెప్పండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది.
మొత్తంగా ఏప్రిల్ 1 నుండి కొన్ని ఫోన్ నెంబర్లకు మాత్రమే యూపిఐ సేవలు నిలిచిపోతాయి... కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వినియోగంలో లేని నంబర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటారు... యాక్టివ్ గా ఉండే నంబర్లకు యధావిధిగానే యూపిఐ సేవలు అందుబాటులో ఉంటాయి... ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ఎప్పటిలాగే పనిచేస్తాయి.