అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్, మరో విషయంలోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎలాన్ మస్క్ పరిచయం చేయబోతున్నారనేదే ఆ వార్త. దీని ప్రత్యేకతలు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ ఫోన్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు. ఛార్జ్ కూడా చేయవలసిన అవసరం లేదని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఛార్జింగ్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని చాలా మందికి డౌట్ ఉంది. ఇది నిజమో కాదో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్ తన కంపెనీల ద్వారా వ్యాపార రంగాల్లో ఊహించని మార్పులు తీసుకు వస్తున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణం, టెస్లా ద్వారా ఎలక్ట్రిక్ కార్ల తయారీ, సోషల్ మీడియాలో ఎక్స్.. ఇలా అనేక రంగాల్లో మస్క్ ఆయన మార్క్ చూపిస్తున్నారు. అందువల్ల సెల్ ఫోన్ మార్కెట్ లోకి కూడా మస్క్ వస్తారని బాగా ప్రచారం జరుగుతోంది.
అయితే టెస్లా స్మార్ట్‌ఫోన్ గురించి ఎలాన్ మస్క్ గాని, టెస్లా కంపెనీ గాని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టెస్లా కంపెనీ 2021 నుంచి స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే పరిశ్రమలోకి అడుగుపెడుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇప్పటివరకు టెస్లా నుంచి స్మార్ట్‌ఫోన్‌లు రాలేదు. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే పరిశ్రమ ఏదీ తన వద్ద లేదని ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే టెస్లా పై మూడు అసాధారణ ఫీచర్లతో వస్తుందని ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయాల ప్రకారం టెస్లా స్మార్ట ఫోన్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు. స్పేస్‌ఎక్స్ ఉపగ్రహంతో నేరుగా ఇది పనిచేస్తుందట. సోలార్ ఎనర్జీ ద్వారా ఆటోమెటిక్ గా ఛార్జ్ అవుతుంది అనే ప్రచారం విపరీతంగా వైరల్ అవుతోంది. టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు గతంలో చాలా పుకార్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది టెస్లా ఫోన్‌కు విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తితో ఛార్జ్ చేయవచ్చని బాగా ప్రచారం జరిగింది. టెస్లా కంపెనీ ఇప్పటికే సోలార్ ఎనర్జీని బాగా ఉపయోగిస్తోంది. అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసే అవకాశం కచ్చితంగా ఉందంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఇంకా ప్రచారం జరుగుతున్న విషయాలు ఏంటంటే.. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ అందించిన స్టార్ లింక్ మోడల్ టెక్నాలజీ ఈ ఫోన్‌లో ఉపయోగించారు. ఇది శాటిలైట్ ద్వారా అందించే వేగవంతమైన సిగ్నలింగ్ ని కలిగి ఉండటం వల్ల 5జీ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ కవరేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ లింక్ టెక్నాలజీ చాలా అధునాతనమైనదిగా కనిపిస్తోంది. పైన ఉన్న మోడల్‌లో బ్రెయిన్-మెషిన్-ఇంటర్‌ఫేస్ (BMI) చిప్స్ ఫోన్‌లో ఉంటాయని నెటిజన్లు భావిస్తున్నారు. అంటే మన ఆలోచనలతో పరికరాలను నియంత్రించవచ్చన్న మాట.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంగారక గ్రహంలో కూడా ఫోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందట. ఈ ఫోన్ ధర దాదాపు 100 డాలర్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. కానీ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో తప్పకుండా అడుగుపెడతారని వ్యాపార వర్గాల అంచనా. అది మొబైల్ మార్కెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తుందని కూడా కచ్చితంగా చెప్పవచ్చు.