బ్రిటీష్ కాలంలోనే ఇండియాలో రైల్వే లైన్స్ ప్రారంభమయ్యాయి. 1832లో భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని చెన్నైలో నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. 1835లో మద్రాస్‌లోని రెడ్ హిల్స్, చింతాద్రిపేట్ మధ్య రైల్వే ట్రాక్ నిర్మించారు. 1837లో దీన్ని ప్రారంభించారు. ఈ ట్రైన్ కోసం ఇంగ్లండ్ నుండి రోటరీ స్టీమ్ ఇంజన్ ను తెప్పించి దీన్ని నడిపారు. ఈ ట్రైన్ ను గ్రానైట్ రవాణాకు ఉపయోగించారు.
1854లో తూర్పు భారతదేశపు మొదటి ప్యాసింజర్ రైలు కోల్‌కతా సమీపంలోని హౌరా నుండి హూగ్లీ వరకు నడిపారు. చెన్నై సమీపంలోని రాయపురం, ఆర్కాట్ మధ్య దక్షిణ భారత దేశానికి చెందిన మొదటి ప్రధాన లైను నిర్మాణం 1853లో ప్రారంభమైంది. ఇది 1 జూలై 1856న ప్రారంభించారు. అదేవిధంగా మొట్టమొదటి ఆవిరితో నడిచే రైలును 1837లో చెన్నైలో నడిపారు. మొదటి ప్యాసింజర్ రైలును 1853లో ముంబై-థానే మధ్య నడిపారు. అలాగే 1925లో మొదటి ఎలక్ట్రిక్ రైలును ముంబైలో ప్రారంభించారు. మొదటి లోకోమోటివ్ తయారీ యూనిట్ ను 1950లో చిత్తరంజన్‌లో ప్రారంభించారు. 1955లో మద్రాస్‌లో మొదటి కోచ్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.